Loading...
Nitin Nabin: రాహుల్‌ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌: నితిన్‌ నబీన్
రాహుల్‌ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌: నితిన్‌ నబీన్

Nitin Nabin: రాహుల్‌ గాంధీ అబద్ధాలు చెబుతున్నారు.. తెలంగాణలో కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌: నితిన్‌ నబీన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
05:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'సర్‌' అంశంలో రాహుల్‌ అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం కరీంనగర్‌లో పర్యటించిన నితిన్‌ నబీన్‌.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఓటు చోరీ జరగలేదని స్పష్టం చేశారు. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారని వ్యాఖ్యానించారు.

వివరాలు

చనిపోయిన వారి ఓట్లను తొలగించొద్దా?

మూడు కోట్ల మంది చనిపోయిన వారి ఓట్లను తొలగించొద్దా? అని నితిన్‌ నబీన్‌ ప్రశ్నించారు. 13 కోట్ల ఓట్లు తొలగించారని రాహుల్‌ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశం కోసం కాంగ్రెస్‌ పార్టీ ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని ఉద్ఘాటించారు.

ఢిల్లీలో రూపాయి విడుదల చేస్తే.. అది నేరుగా పేదల ఖాతాలోనే జమ అవుతోందని తెలిపారు. మోదీ నాయకత్వంలోనే బీజేపీ దేశంలో మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో అవినీతి తగ్గిందని నితిన్‌ నబీన్‌ పేర్కొన్నారు.

వివరాలు

తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై నితిన్‌ నబీన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలకు రేవంత్‌రెడ్డి ఏటీఎంలా మారారని విమర్శించారు.

తెలంగాణ ప్రజలను దోచుకుని, ఢిల్లీ బాసులకు ఖజానాను పంపిస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రయోజనాల కంటే ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం కోసమే రేవంత్‌రెడ్డి ప్రదక్షిణలు చేస్తున్నారని ఆక్షేపించారు.

రాష్ట్రంలో గతంలో ఒక అవినీతి ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించారని, అంతకంటే పెద్ద అవినీతి ప్రభుత్వం వస్తుందని అప్పట్లో వారికి తెలియదని వ్యాఖ్యానించారు.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు.

తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పడం ఖాయమని నితిన్‌ నబీన్‌ పేర్కొన్నారు.

ADVERTISEMENT