Election Commission: రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసిన ఎన్నికల సంఘం
రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాలోర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని పనౌతి (చెడు శకునం) అంటూ ఎద్దేవా చెయ్యడంపై ఎన్నికల సంఘం గురువారం నోటీసులు జారీ చేసింది. బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఒక రోజు తర్వాత రాహుల్ కి ఈ నోటీసు వచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాహుల్ గాంధీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరిస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ రాహుల్ గాంధీని కోరింది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు చేతిలో భారత జట్టు ఓడిన విషయం తెలిసిందే.
రాహుల్ వ్యాఖ్యలుసిగ్గుచేట్టన్న రాజీవ్ చంద్రశేఖర్
ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు మోదీ స్టేడియానికి రావడం వల్లే జట్టు ఓటమి పాలైందంటూ రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ మ్యాచ్ లో గెలవాల్సిన ఇండియా ఓ చెడు శకనం వల్లే వారిని ఓడిపోయేలా చేసిందని మోదీని ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తన వ్యాఖ్యల్లో ఎక్కడా నరేంద్రమోదీ పేరును రాహుల్ ఎత్తకుండా నేరుగానే విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, అవమానకరమని అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాహుల్ మానసిక అస్థిరతకు ఆయన మాటలు అద్దంపడుతున్నాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ విమర్శించారు.