
Rahul Gandhi: నేటి నుంచి బీహార్‌లో రాహుల్ గాంధీ 'ఓటర్ అధికార్ యాత్ర' ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరం వేడెక్కింది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిష్టాత్మకంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఆయన ఆగస్టు 17 నుంచి బీహార్‌లో ప్రత్యేక యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ యాత్రకు 'ఓటర్ అధికార్ యాత్ర' అనే పేరు పెట్టారు.
Details
రోహ్తాస్ నుంచి యాత్ర ఆరంభం
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీహార్ రాష్ట్రంలో చేపట్టిన 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)'కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఈ యాత్ర నిర్వహించనున్నారు. మొత్తం 16 రోజుల పాటు కొనసాగనున్న ఈ యాత్రలో ఆయన 24 జిల్లాల్లో పర్యటించనున్నారు.అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 1న పాట్నాలో నిర్వహించబోయే భారీ ర్యాలీతో ఈ యాత్ర ముగియనుంది. ససారాం నుంచి రాహుల్ గాంధీ యాత్ర ప్రారంభించనున్నారని ఎంపీ అఖిలేష్ ప్రసాద్ సింగ్ తెలిపారు. ఈ యాత్రకు అవసరమైన అన్ని అధికారిక అనుమతులు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. యాత్రలో ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, వామపక్ష పార్టీల నాయకులు, ఇతర కూటమి పార్టీలు కూడా రాహుల్‌తో కలిసి నడిచే అవకాశముందని సమాచారం.
Details
'ఓట్ల చోరీ'కి వ్యతిరేక పోరాటం
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే 'ఓటర్ అధికార్ యాత్ర'తో బీహార్‌లో ఓటు దొంగతనానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష పోరాటం చేపడుతున్నామని తెలిపారు. ఇది కేవలం ఎన్నికల సమస్య కాదని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం 'ఒక వ్యక్తి - ఒక ఓటు' అనే మూల సూత్రాన్ని రక్షించడానికి జరిగే నిర్ణయాత్మక యుద్ధమని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటంలో బీహార్ యువత తనతో కలిసివస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. అందరూ ముందుకు వచ్చి తమతో చేరి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు