Page Loader
శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ
శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా, జైల్లో పెట్టినా తగ్గేది లేదు: రాహుల్ గాంధీ

శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ

వ్రాసిన వారు Stalin
Mar 25, 2023
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

పరువు నష్టం కేసులో సూరుత్ కోర్టు తీర్పు, లోక్‌సభలో అనర్హత వేటు, అధికార బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం నిప్పులు చెరిగారు. ఏఐసీసీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. భారతదేశంలో ప్రజాస్వామ్యంపై దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి ఘటనలే ఉదాహరణలుగా నిలుస్తున్నాయన్నారు. తన పేరు సావర్కర్ కాదని, గాంధీ అని రాహుల్ పేర్కొన్నారు. గాంధీ ఎప్పుడూ క్షమాపణ చెప్పలేదని, రాహుల్ గాంధీ కూడా చెప్పబోరని బీజేపీకి కౌంటర్ ఇచ్చారు. తనను బీజేపీ ప్రభుత్వం శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా, తన పని తాను చేసుకుంటూ పోతానన్నారు రాహుల్ గాంధీ. నాకు మద్దతిచ్చిన ప్రతిపక్షాలందరికీ ధన్యవాదాలు తెలిపిన రాహుల్, అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు.

రాహుల్ గాంధీ

అదానీ షెల్‌ కంపెనీల్లో రూ. 20,000 కోట్లు ఎక్కడివి?

అదానీ షెల్‌ కంపెనీల్లో రూ. 20,000 కోట్లను ఎవరు పెట్టుబడిగా పెట్టారనేది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయిందన్నారు. తాను ఎప్పుడూ సోదరభావంగా మాట్లాడుతానని, బీబీసీ ఓబీసీలను అవమానించారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాహుల్ ఖండించారు. తాను భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య స్వరాన్ని రక్షించడానికి పోరాడుతున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఇది కొనసాగిస్తానని చెప్పారు. తాను ఎవరికి భయపడేది లేదన్నారు. అదానీ సమస్య నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు అనర్హత వేటు పేరుతో కేంద్ర ఆట ఆడుతోందని రాహుల్ మండిపడ్డారు. అనర్హత వేటు వేసి తనను జైళ్లో పెట్టి భయపెట్టలేరని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను వెనక్కి వెళ్లేది లేదన్నారు. తాను లండన్ విదేశీ జోక్యాన్ని కోరినట్లు కేంద్రమంత్రులు అబద్ధాలు చెప్పారని, తాను అలా చేయలేదన్నారు.