Amethi-Raebareli Candidates: అమేథీ-రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేస్తారా?
రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్'లోని ఈ రెండు ముఖ్యమైన స్థానాల నుండి ఈ ఇద్దరు నేతలను ఎన్నికల్లో పోటీ చేసేలా చేయాలని పార్టీ నిర్ణయించుకుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు స్థానాల్లో పోటీ చేయాలని రాహుల్, ప్రియాంకలను సోనియా గాంధీ కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీతో పాటు, అమేథీ, రాయ్‌బరేలీలోని స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఈ స్థానాల నుండి ఎన్నికల్లో పోటీ చేయాలని ఇటీవల నాయకత్వాన్ని కోరారు.
ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నసోనియా
2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, సోనియా గాంధీ రాయ్‌బరేలీ నుంచి గెలిచారు. అయితే సోనియా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలు . అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా కేరళలోని వాయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గతసారి వయనాడ్ నుంచి మాత్రమే గెలిచారు. వాయనాడ్‌లో ఓటింగ్ జరిగింది. మే 20న అమేథీ, రాయ్‌బరేలీలో పోలింగ్ జరగనుంది.
మే 3 నామినేషన్ కి చివరి రోజు
ఏప్రిల్ 26 నుంచి అమేథీ, రాయ్‌బరేలీలో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి చివరి తేదీ మే 3, అయితే కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. భారతీయ జనతా పార్టీ అమేథీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని మరోసారి ప్రకటించింది. స్మృతి కూడా ఏప్రిల్ 29న తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. అయితే రాయ్‌బరేలీ నుంచి బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అంతకుముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ అమేథీ, రాయ్ బరేలీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే హక్కును కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చిందని చెప్పారు. మరికొద్ది గంటల్లో మల్లికార్జున్ ఖర్గే పేరు ఖరారు చేసి, ప్రకటించనున్నారు.