LOADING...
Visakhapatnam: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో రైడెన్‌.. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు
ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు

Visakhapatnam: విశాఖలో రూ.87 వేల కోట్ల పెట్టుబడులతో రైడెన్‌.. ప్రోత్సాహకాలపై ప్రభుత్వంతో సంప్రదింపులు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం నగరానికి మరో అంతర్జాతీయ స్థాయి ఐటీ సంస్థ చేరబోతోంది. గూగుల్‌ అనుబంధ సంస్థగా ఉన్న రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, మొత్తం రూ.87,250 కోట్లు (దాదాపు 10 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) పెట్టుబడులతో, 1,000 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత పవర్‌ డేటా సెంటర్‌‌ను విశాఖలో ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రాజెక్టు మొదటి దశను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేయాలని సంస్థ ప్రతిపాదనలు సమర్పించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై ఉన్నతాధికారుల బృందం చర్చలు జరుపుతోందని సమాచారం. సంస్థకు ఇవ్వవలసిన ప్రోత్సాహకాలు, అవసరమైన అనుమతులు, ఇతర సంబంధిత అంశాలపై స్పష్టత రావాల్సి ఉందని తెలుస్తోంది.

వివరాలు 

మూడు చోట్ల.. 480 ఎకరాలు! 

ఇప్పటికే గూగుల్‌ సంస్థ రూ.52,000కోట్ల పెట్టుబడులతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌ను విశాఖలో నెలకొల్పడానికి సిద్ధమైంది. అదేవిధంగా, సిఫీ టెక్నాలజీస్‌ కూడా రూ.16,000కోట్ల పెట్టుబడులతో విశాఖలో డేటా సెంటర్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రైడెన్‌ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో డేటా సెంటర్లు నిర్మించాలన్న ప్రతిపాదనను సమర్పించింది. వీటిలో.. అడవివరంలో 120ఎకరాలు, తర్లువాడలో 200ఎకరాలు,రాంబిల్లి-అచ్యుతాపురం క్లస్టర్‌లో 160ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరింది. అనుమతులు లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించి,రెండున్నర సంవత్సరాల్లో మొదటి దశ పనులు పూర్తి చేస్తామని కంపెనీ తెలిపింది. అన్ని అనుమతులు సమయానికి లభిస్తే,2026 మార్చి నెలలో నిర్మాణాలు ప్రారంభించి,2028 జూలై నాటికి ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభించడమే లక్ష్యంగా పేర్కొంది.

వివరాలు 

2,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం 

ప్రతిపాదిత మూడు డేటా సెంటర్ల కలిపి సుమారు 2,100 మెగావాట్ల విద్యుత్‌ అవసరం ఉండనుందని రైడెన్‌ పేర్కొంది. ఈ విద్యుత్‌ను నేరుగా విద్యుత్‌ సరఫరా సంస్థల నుంచే పొందే ప్రణాళిక ఉందని తెలిపింది. వాటిలో.. అడవివరం యూనిట్‌కు 465 మెగావాట్లు, తర్లువాడ యూనిట్‌కు 929 మెగావాట్లు, రాంబిల్లి యూనిట్‌కు 697 మెగావాట్లు అవసరమవుతాయని వివరించింది.

వివరాలు 

సింగపూర్‌ పెట్టుబడి, గూగుల్‌ మద్దతు 

రైడెన్‌ ఏపీఏసీ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్‌ కంపెనీ సింగపూర్‌లో నమోదై ఉంది. ఇది 'రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌'లో మెజారిటీ వాటాదారుగా ఉంది. ఈ సంస్థకు అమెరికా దిగ్గజ సంస్థ గూగుల్‌ ఎల్‌ఎల్‌సీ అనుబంధంగా ఉంది. రైడెన్‌ ఏపీఏసీ ఈ భారీ డేటా సెంటర్‌ ప్రాజెక్టుకు అవసరమైన నిధులను సమకూర్చనుందని ప్రభుత్వానికి తెలిపింది. అంతేకాకుండా, ఈ సంస్థ నాస్‌డాక్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీగా నమోదైందని కూడా స్పష్టంచేసింది.