Indian Railway: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో నిధుల పెరుగుదల 2.2 శాతమే!
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సంబంధించిన రైల్వే కేటాయింపులు ఈసారి కూడా పెద్దగా పెరగలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.5,337 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో ఆ మొత్తం రూ.5,454 కోట్లకు మాత్రమే పెరిగింది. అంటే కేవలం రూ.117 కోట్ల పెరుగుదలతో, శాతం పరంగా చూస్తే సుమారు 2.2 శాతం మాత్రమే వృద్ధి నమోదైంది. దేశవ్యాప్తంగా రైల్వేలకు దాదాపు 10 శాతం మేర నిధులు పెరిగిన నేపథ్యంలో, తెలంగాణకు వచ్చిన పెరుగుదల చాలా తక్కువగా ఉండటం గమనార్హం.
వివరాలు
నిర్మాణంలో ఉన్న పనులను పూర్తిచేయడానికి కనీసం మరో పదేళ్లు
తెలంగాణలో ప్రస్తుతం రూ.47,984 కోట్ల వ్యయంతో రైల్వే ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అయితే ఈ ఏడాది కేటాయించిన మొత్తం రూ.5,454 కోట్లే కావడంతో, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను పూర్తిచేయడానికి కనీసం మరో పదేళ్లు పట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి తెలంగాణకు కేటాయించిన మొత్తం నిధులు, బుల్లెట్ రైలు ప్రాజెక్టుల గురించి మాత్రమే వివరించారు. రాష్ట్రంలో సికింద్రాబాద్‌తో పాటు ఇతర ప్రధాన రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి, కొత్త రైల్వే లైన్లు, రెండో, మూడో లైన్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ, ఏ ప్రాజెక్టుకు ఎంత మొత్తంలో నిధులు కేటాయించారన్న స్పష్టమైన సమాచారం మాత్రం రైల్వేశాఖగానీ, దక్షిణ మధ్య రైల్వేగానీ వెల్లడించలేదు.
వివరాలు
రాష్ట్రంలోని ఇతర రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి కూడా దాదాపు ఇదే..
2016-17లో ప్రారంభించిన 151.36 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్-కొత్తపల్లి నూతన రైల్వే లైన్ పనులు దాదాపు పదేళ్లు గడిచినా ఇప్పటివరకు సగం దూరమైన 76 కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన భాగాన్ని పూర్తిచేయడానికి కూడా మరో దశాబ్దకాలం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ఇతర రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి కూడా దాదాపు ఇదే విధంగా ఉంది.
వివరాలు
పింక్‌బుక్ ఈసారీ లేనట్లే!
సాధారణంగా ప్రాజెక్టులవారీగా నిధుల కేటాయింపు వివరాలు 'పింక్‌బుక్'లో పొందుపరిచేవారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే రైల్వే బోర్డు ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనవాయితీగా ఉండేది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఏ ప్రాజెక్టుకు ఎంత నిధులు కేటాయించారన్న వివరాలను రైల్వేశాఖ ఇప్పటివరకు వెల్లడించలేదు. ఏడాది గడిచినా సంబంధిత పింక్‌బుక్‌ను రైల్వే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకపోవడం గమనార్హం.
వివరాలు
పింక్‌బుక్ ఈసారీ లేనట్లే!
ఈ నేపథ్యంలో, ఈసారి కూడా ప్రాజెక్టులవారీ నిధుల కేటాయింపుల వివరాలతో కూడిన పింక్‌బుక్ విడుదలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత ఏడాది తెలంగాణకు వచ్చిన నిధుల్లో ఏ ప్రాజెక్టుకు ఎంత కేటాయించారు, ఎంత వరకు ఖర్చయిందన్న అంశాలను దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది. నిర్మాణ పనుల పురోగతిని బట్టి మాత్రమే నిధులు విడుదల చేస్తున్నామని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ శ్రీధర్ తెలిపారు. గత సంవత్సరం పింక్‌బుక్ విడుదల కాలేదని, ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దీనిపై ఎలాంటి సూచనలు అందలేదని ఆయన స్పష్టం చేశారు.