Page Loader
Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం 
మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం

Tatkal Tkt Booking: జూలై 1 నుంచి తత్కాల్ టికెట్లకు కొత్త నిబంధనలు: మోసాల నివారణకు భారతీయ రైల్వే కీలక నిర్ణయం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వే జూలై 1వ తేదీ నుండి తత్కాల్ కోటా కింద టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలును ప్రవేశపెడుతోంది. ఈ మార్పులు టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చడంతో పాటు, తరచుగా ఎదురయ్యే మోసాలను అడ్డుకునే లక్ష్యంతో తీసుకొచ్చినవేనని అధికారులు తెలిపారు. ఏజెంట్లు, బాట్ల ద్వారా టికెట్లను పెద్ద మొత్తంలో బుక్ చేయడం వల్ల సాధారణ ప్రయాణికులకు టికెట్లు దక్కడం కష్టమవుతుండటంతో, వారి ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త నిబంధనలు అమలులోకి తీసుకువస్తున్నారు.

వివరాలు 

ప్రయాణికుల సౌకర్యం కోసం 

ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై ఆధార్ కార్డు ద్వారా ధృవీకరించబడిన యూజర్లకు మాత్రమే తత్కాల్ టికెట్ల బుకింగ్ అవకాశం లభించనుంది. జూలై నెల నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుండగా, ఐఆర్సీటీసీ వెబ్‌సైట్ లేదా యాప్‌ ద్వారా మాత్రమే ఆధార్ వెరిఫై చేసిన యూజర్లు టికెట్లు బుక్ చేసుకోగలరని రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా,జూలై 15వ తేదీ నుండి ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్లకు ఓటీపీ ద్వారా ధృవీకరణ విధానంను కూడా ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. దీనివల్ల నిజమైన ప్రయాణికులకు అవసరమైన సమయంలో ధృవీకరించబడిన టికెట్లు పొందడం సులభమవుతుందని రైల్వే శాఖ చెబుతోంది.

వివరాలు 

ఏజెంట్లకు తత్కాల్ బుకింగ్ 30 నిమిషాల తర్వాతే 

''తత్కాల్ టికెట్లను బుక్ చేయడానికి భారతీయ రైల్వే త్వరలో ఇ-ఆధార్ ధృవీకరణను ఉపయోగించడం ప్రారంభిస్తుంది. ఇది నిజమైన వినియోగదారులకు అవసరమైనప్పుడు ధృవీకరించబడిన టికెట్లను పొందడానికి సహాయపడుతుంది"' అని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 'ఎక్స్' (మాజీ ట్విట్టర్) లో పేర్కొన్నారు. తత్కాల్ బుకింగ్ సమయంలో సాధారణ ప్రయాణికులకు అవకాశం కల్పించేందుకు,అధీకృత ఏజెంట్లకు బుకింగ్ అవకాశం ప్రారంభమైన అరగంట తర్వాతే కల్పిస్తామని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉదాహరణకు, ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లకు ఉదయం 10:00 నుంచి 10:30 గంటల వరకు,అలాగే నాన్-ఎసీ కోచ్‌లకు ఉదయం 11:00 నుంచి 11:30 గంటల వరకు, ఏజెంట్లకు బుకింగ్ అనుమతి ఉండదు. ఇది అధికారికంగా గుర్తించబడిన ఐఆర్సీటీసీ ఏజెంట్లకైనా వర్తిస్తుంది.

వివరాలు 

 24 మిలియన్ల యూజర్ల బ్లాక్ 

వారు బహుళ యూజర్ ఐడీలు, ఇమెయిల్స్ ఉన్నప్పటికీ ఈ ప్రారంభ 30 నిమిషాల సమయంలో టికెట్లను బుక్ చేయలేరు. ఇంకా, తత్కాల్ బుకింగ్‌ సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడడం ద్వారా టికెట్లను కబ్జా చేయడం వంటి మోసాలను అడ్డుకునేందుకు, గత ఆరు నెలల్లో ఐఆర్సీటీసీ సుమారు 24 మిలియన్ల యూజర్లను బ్లాక్ చేసినట్లు అధికారులు తెలిపారు. అదనంగా, ఇంకా 2 మిలియన్ల మందిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.