LOADING...
Rain Alert in Andhra Pradesh: ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు
ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు

Rain Alert in Andhra Pradesh: ద్రోణి ఎఫెక్ట్.. నేడు ఏపీలో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
08:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీలో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాల వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ముఖ్యంగా మార్కాపురం ప్రాంతంతో పాటు రాయలసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

వివరాలు 

ఎండల తీవ్రత

ఇదిలా ఉండగా, బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నమోదైన వర్షపాతం వివరాలను కూడా అధికారులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో అత్యధికంగా 72.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా, లావేరులో 64.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత కూడా కొనసాగుతోంది. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

వివరాలు 

విశాఖలో గాలివాన బీభత్సం

అటు విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకూలగా, అనేక చెట్లు విరిగి పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ శాఖ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.

Advertisement