LOADING...
Mumbai: ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి
ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి

Mumbai: ముంబయిలో వర్ష బీభత్సం.. 8 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 16, 2025
01:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం మౌసూన్‌ తీవ్రంగా విరుచుకుపడింది. మురుసుగా కురిసిన భారీ వర్షాలతో నగరం అతలాకుతలమైంది. పిడుగులు పడిన ఘటనల్లో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు మరింత దారుణంగా మారనున్న నేపథ్యంలో, రత్నగిరి, రాయ్‌గఢ్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించగా.. పాల్ఘర్‌, ఠాణె, సింధుదుర్గ్‌, పుణె జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. అత్యధిక వర్షపాతం రత్నగిరిలో 88.1 మిల్లీమీటర్లు నమోదు కాగా, రాయ్‌గఢ్‌లో65.3, సింధుదుర్గ్‌లో 43.8, ఠాణెలో 29.6, యావత్మాల్‌లో 27.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక కేరళలోనూ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఎడతెరిపిలేని వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Details

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పలు చోట్ల చెట్లు, కొండచరియలు విరిగిపడడంతో రవాణా నిలిచిపోయింది. తీర ప్రాంతాల్లో భూకోతలు తీవ్రంగా నమోదు కావడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వర్షాల తీవ్రత దృష్ట్యా ఐదు జిల్లాల్లో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. శబరిమల యాత్రకు ముఖ్యమైన పంబ నదిలో నీటిమట్టం ఎగసిపడుతోంది. ఈ నేపథ్యంలో పంబ నదిలో స్నానం చేయడాన్ని తాత్కాలికంగా నిషేధించినట్లు పథనంథిట్ట జిల్లా యంత్రాంగం ప్రకటించింది. శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు పంబ-సన్నిధానం ట్రెక్కింగ్ మార్గంలో అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని ట్రావెన్‌కోర్ దేవస్వోం బోర్డు సూచించింది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల మేరకు పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ చేసినట్లు సమాచారం.