
Heavy Rains: వర్షాలు మళ్లీ వచ్చేస్తున్నాయ్.. ఆగస్టు 5 నుంచి భారీ వర్షాల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరంతో పాటు అన్ని జిల్లాల్లో వర్షాలు దంచికొట్టాయి. నాలుగు నుంచి ఐదు రోజులపాటు ఎడతెరిపిలేకుండా వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు రాకపోకల్లో అంతరాయం ఎదుర్కొన్నారు. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గడంతో ప్రజలు, రైతులు తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే తిరిగి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Details
రెండ్రోజుల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలో వాయుగుండంగా మారే అవకాశముందని వెల్లడించింది. అలాగే ఆగస్టు 2 నాటికి అండమాన్ నికోబార్ దీవులకు పశ్చిమంగా మరో అల్పపీడనం ఏర్పడనుందని, అది బలపడితే ఆగస్టు 5 తరువాత తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.