Rains In Telangana: తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం శుక్రవారం రోజున ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరింది. ఇది 1.5 కి.మీ నుంచి 4.5 కి.మీ ఎత్తులో కొనసాగుతుండటంతో పశ్చిమ, వాయువ్య దిశ నుంచి తెలంగాణలో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఆవర్తన ప్రభావంతో జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
ఎల్లో హెచ్చరికలు జారీ
సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదివారం కూడా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్ష సూచన ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించింది.