Andhra pradesh: ఏపీలో వాతావరణ మార్పులు.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు!
ఈ వార్తాకథనం ఏంటి
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు కొన్నిచోట్ల వడగాలుల ప్రభావం కూడా కొనసాగుతుందని హెచ్చరించింది. మంగళవారం శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
వివరాలు
8 మండలాల్లో తీవ్ర వడగాలులు,13 మండలాల్లో సాధారణ వడగాలులు
రాష్ట్రంలోని 8 మండలాల్లో తీవ్ర వడగాలులు, మరో 13 మండలాల్లో సాధారణ వడగాలులు వీచే అవకాశముందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, సీతానగరం మండలాలు, అలాగే పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీసే అవకాశం ఉందని అంచనా వేశారు. అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో కూడా వడగాలుల ప్రభావం కనిపించవచ్చని వెల్లడించారు. ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వివరాలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఇక సోమవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలో 42.5 డిగ్రీలుగా నమోదైంది. కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.3 డిగ్రీలు, అనంతపురం జిల్లా యల్లనూరు, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 40.5 డిగ్రీలు నమోదు కాగా, మార్కాపురం జిల్లా పిటికాయగుల్ల, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.