CDS: కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి బాధ్యతలు.. సైనిక సంస్కరణలపై ఫోకస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. దీంతో భారత సైన్యంలో కీలకమైన మిలటరీ థియేటరైజేషన్ ప్రక్రియను ఇకపై జనరల్ రాజా సుబ్రమణి పర్యవేక్షించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల మధ్య సమన్వయం మరింత మెరుగుపడుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. చైనా, పాకిస్థాన్‌కు సంబంధించిన వ్యూహాత్మక అంశాల్లో నిపుణుడిగా జనరల్ రాజా సుబ్రమణికి సైనిక వర్గాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన గతంలో నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్‌కు మిలిటరీ అడ్వైజర్‌గా సేవలందించారు.
వివరాలు
అనిల్ చౌహాన్ పదవీకాలం ముగింపు
అలాగే వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతల్లో భాగంగా ఇంటిగ్రేటెడ్ మిలిటరీ కమాండ్స్ ఏర్పాటు, మిలటరీ థియేటరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయడం వంటి కీలక బాధ్యతలు ఆయన భుజాలపై ఉన్నాయి. మరోవైపు సీడీఎస్‌గా పనిచేసిన జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం శనివారంతో ముగిసింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జనరల్ రాజా సుబ్రమణి, దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు భారత సైనిక దళాలు పూర్తిగా కట్టుబడి ఉన్నాయని తెలిపారు. దేశ సేవ కోసం దళాలు సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.