Rajasthan: 56 గంటల పాటు శ్రమించిన దక్కని ప్రాణం..150 అడుగుల లోతున్న బోరుబావిలో పడి 5 ఏళ్ల బాలుడు మృతి
రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో 150 అడుగుల బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ఆర్యన్‌ను రెస్క్యూ సిబ్బంది రక్షించిన విషయం తెలిసిందే. కానీ ఈ సంఘటన విషాదాంతమైంది. దాదాపు 56 గంటల పాటు శ్రమించి ఆ చిన్నారిని రక్షించినప్పటికీ, అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆసుపత్రికి తరలించినప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సోమవారం మధ్యాహ్నం దౌసా జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో ఆర్యన్ తన తల్లి వద్ద ఆడుకుంటూ ఇంటి పక్కన ఉన్న 150 అడుగుల లోతు గల బోరుబావిలో పడిపోయాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించగా, అధికారులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ దేవేంద్ర యాదవ్ ఘటనా స్థలానికి చేరుకుని చర్యలను పర్యవేక్షించారు.
పైలింగ్ మిషన్ సాయంతో రక్షించే ప్రయత్నాలు
మొదటగా ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా ఆర్యన్‌ను రక్షించే ప్రయత్నాలు చేశాయి, కానీ అవి పలుమార్లు విఫలమయ్యాయి. ఆ తర్వాత పలు మార్లు ప్రయత్నించినప్పటికీ, ఫలితం లేకపోయింది. పైలింగ్ మిషన్ సాయంతో అధికారులు బోరుబావి పక్కనే, దాదాపు 4 నుంచి 5 అడుగుల దూరంలో, 4 అడుగుల వెడల్పుతో ఒక గొయ్యిని తవ్వారు. బుధవారం నాటికి 150 అడుగుల లోతు తవ్వకం పూర్తయ్యాక, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ఆ గొయ్యిలోకి దిగి, సొరంగం తవ్వి బాలుడిని రక్షించడానికి యత్నించారు. అయితే, అప్పటికి బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆసుపత్రికి తరలించిన తర్వాత, చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.