Asaram Bapu: ఆసారాం బాపూకు దక్కని ఊరట .. జీవిత ఖైదును కొనసాగించిన రాజస్థాన్ హైకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో స్వయంఘోషిత ఆధ్యాత్మిక గురువు ఆసారాంబాపూకు విధించిన జీవిత ఖైదు శిక్షను రాజస్థాన్ హైకోర్టు కొనసాగించింది. జోధ్‌పూర్ బెంచ్ 2018లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఆసారాం దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది. అయితే గ్యాంగ్‌రేప్,క్రిమినల్ కాన్స్పిరసీ ఆరోపణల నుంచి ఆయనకు ఊరట లభించింది. వైద్య కారణాలతో తాత్కాలిక బెయిల్‌పై ఉన్న ఆసారాంను వెంటనే లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. జస్టిస్ అరుణ్ కుమార్ మోంగా,జస్టిస్ యోగేంద్ర కుమార్ పురోహిత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. ఐపీసీ కింద నమోదైన అత్యాచారం ఆరోపణలు,పోక్సో చట్టం కింద లైంగిక దాడి,జువెనైల్ జస్టిస్ చట్టానికి సంబంధించిన నేరాలు నిరూపితమయ్యాయని పేర్కొంది. అయితే గ్యాంగ్‌రేప్,క్రిమినల్ కుట్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని వెల్లడించింది.
వివరాలు
కేసు వివరాలు
ఈ కేసులో సహ నిందితులైన శరత్‌చంద్ర, శిల్పిలను అన్ని ఆరోపణల నుంచి నిర్దోషులుగా ప్రకటించింది. 2013లో ఆసారాం అనుచరులైన ఓ దంపతులు తమ కుమార్తెపై లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఆ బాలికను ఆధ్యాత్మిక విద్య కోసం ఆసారాం ఆశ్రమానికి పంపినట్లు పోలీసులు తెలిపారు. బాలికపై దెయ్యాల ప్రభావం ఉందని చెప్పి, జోధ్‌పూర్‌కు తీసుకురావాలని ఆసారాం అనుచరులు తల్లిదండ్రులకు సూచించినట్లు విచారణలో వెల్లడైంది. ఆశ్రమానికి వచ్చిన తర్వాత బాలికను చికిత్స పేరుతో తన గదికి పిలిచిన ఆసారాం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు బయట ఆయన ప్రార్థనలు చేస్తూ ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం
విషయం బయట చెబితే కుటుంబాన్ని చంపేస్తానని బాలికను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 2018 ఏప్రిల్‌లో ప్రత్యేక పోక్సో కోర్టు ఆసారాంను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. సహ నిందితులను నిర్దోషులుగా విడుదల చేసిన హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని అడ్వకేట్ సోలంకి తెలిపారు.