Rajiv Swagruha Corporation: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ వేలం.. తెలంగాణ సర్కారుకి రూ.46 కోట్ల ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రజలు ఊహించిన దాంట్లో ఎక్కువగానే స్పందించారు. సోమవారం జరిగిన తొలి దశ వేలంలో తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కోసం కొనుగోలుదారులు భారీగా పోటీ పడ్డారు. దీంతో అక్కడి కొన్ని ప్లాట్లకు చదరపు గజం ధర గరిష్ఠంగా రూ.39,000 వరకు చేరింది. ఓఆర్‌ఆర్‌కు సమీపంలో ఉన్న తొర్రూర్, కుర్మల్‌గూడ,బహదూర్‌పల్లి పరిధిలో మొత్తం 163 ప్లాట్లను అమ్మకానికి ఉంచుతూ స్వగృహ కార్పొరేషన్ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రణాళికలో భాగంగా,సోమవారం తొర్రూర్‌లోని 59 ప్లాట్లను వేలం వేశారు. ప్రభుత్వం నిర్ణయించిన కనీస ధర చదరపు గజానికి రూ.25,000 కాగా,వేలంలో సగటు ధర రూ.28,700గా నమోదైందని అధికారులు తెలిపారు.
వివరాలు
నేడు కూడా కొనసాగనున్న ప్లాట్ల విక్రయాలు
ఈ వేలం ప్రక్రియలో దాదాపు 110 మంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ఈ రోజున జరిగిన అమ్మకాల ద్వారానే ప్రభుత్వం సుమారు రూ.46 కోట్ల ఆదాయం పొందిందని స్వగృహ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. మంగళవారం కూడా వేలం కొనసాగుతుందని, తొర్రూర్‌లో మిగిలిన 65 ప్లాట్లు, కుర్మల్‌గూడలో 25, బహదూర్‌పల్లిలో 13 ప్లాట్లకు వేలం చేపడతామని ఆయన చెప్పారు.