Loksabha: 'ఓటు చోరీ' నినాదాలపై పార్లమెంట్‌లో రచ్చ,ఉభయ సభలు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్‌లోని లోక్‌సభ, రాజ్యసభల్లో బీజేపీ ఎంపీలు నిరసనలకు దిగారు. ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ నిర్వహించిన 'ఓటు చోరీ' బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకులు మోదీ ప్రభుత్వం తో పాటు ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా ''మోదీకి సమాధి తవ్వాలి'' అంటూ నినాదాలు చేయడం వివాదానికి దారితీసింది. ఈ ఘటనకు ప్రతిస్పందనగా సోమవారం పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తక్షణమే క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. ప్రధాని మోదీపై హత్యా ఉద్దేశ్యాన్ని ప్రదర్శించారా? అంటూ కమలదళం సభ్యులు ప్రశ్నించారు. సభల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో లోక్‌సభ,రాజ్యసభలను మధ్యాహ్నం 12గంటల వరకు వాయిదా వేశారు.
వివరాలు
ఓటు చోరీ అంశంపై రాజకీయ రగడ
ఇదే సమయంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ,ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటు చోరీకి పాల్పడుతున్న విషయం దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినప్పటికీ ఎలాంటి సమాధానం రావడం లేదని తెలిపారు. ఓటుచోరీ బీజేపీ స్వభావంలోనే భాగమైందని ఆరోపించారు.అధికారం కోల్పోయే సమయంలో మోదీ అసలైన రూపం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ 1న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19వరకు కొనసాగనున్నాయి. సమావేశాలు మొదలైనప్పటి నుంచే ఓటు చోరీ అంశంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. గత వర్షాకాల సమావేశాలు కూడా ఇలాంటి వివాదాలతోనే ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుత సమావేశాలు కూడా అదే తరహాలో ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి.