LOADING...
Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం
రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం

Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
12:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లాను విచారిస్తున్న దర్యాప్తు అధికారులు తాజాగా మరో కీలక కోణాన్ని గుర్తించినట్లు సమాచారం. ఆలయంలోని వివిధ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి నియామకాలు చేపట్టినట్లు అతడు విచారణలో వెల్లడించినట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్‌కు చెందిన కీలక సభ్యులను కూడా ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. రామమందిరంలో సుమారు 125 మంది ఉద్యోగులను వివిధ పోస్టుల్లో నియమించినట్లు సమాచారం. వీరిలో కొందరి నుంచి ఉద్యోగాల పేరుతో నగదు వసూలు చేసినట్లు దర్యాప్తులో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాలు 

ఈ నియామకాలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి?

ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు, అధికారిక సర్వీస్ అగ్రిమెంట్లు లేదా ఇతర కీలక పత్రాలు పోలీసులకు అందలేదు. దీంతో ఈ నియామకాలు ఎవరి ఆదేశాల మేరకు జరిగాయి? ఇందులో ఎవరి పాత్ర ఉంది? అనే అంశాలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగుల బ్యాంకు ఖాతాలు, వారి ఆర్థిక లావాదేవీలను కూడా అధికారులు పరిశీలించనున్నారు. నియామకాల అనంతరం భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయా అనే విషయాన్ని గుర్తించేందుకు బ్యాంకింగ్ రికార్డులను పరిశీలించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన అనుకల్ప్ మిశ్రా, లవ్ కుశ్ మిశ్రా కూడా ఉద్యోగ నియామకాల అక్రమాల్లో కీలక పాత్ర పోషించి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

వివరాలు 

నిందితుల ఇళ్లలో సోదాలు

మరోవైపు, రామమందిర విరాళాల చోరీ కేసులో అరెస్టైన ఎనిమిది మంది నిందితులు గత ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన కుంభమేళా సమయంలో అత్యధిక మొత్తంలో విరాళాలను అక్రమంగా దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దర్యాప్తును మరింత వేగవంతం చేసిన పోలీసులు బుధవారం మరోసారి నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ యోగా కేంద్రంలో 'రామరాజ్య కోశ్' పేరుతో ఉన్న విరాళాల హుండీని స్వాధీనం చేసుకున్నారు. ఆ హుండీపై పేటీఎం క్యూఆర్ కోడ్ కూడా ఉండటాన్ని అధికారులు గుర్తించారు.

Advertisement

వివరాలు 

యోగా కేంద్రంలోని ఒక గదిలో నివాసం ఉంటున్న అవినాష్ శుక్లా

ఈ కేసులో నిందితుడైన అవినాష్ శుక్లా గత పదేళ్లుగా అదే యోగా కేంద్రంలోని ఒక గదిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే ఈ మొత్తం కుంభకోణంలో ఎస్‌బీఐకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు లేఖ పంపినట్లు సమాచారం.

Advertisement