Ayodhya donation theft case: రామమందిర విరాళాల కేసు.. ట్రస్ట్ చీఫ్ చంపత్ రాయ్ రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
రామమందిర విరాళాల దుర్వినియోగం కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ట్రస్ట్ చీఫ్ చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా శుక్రవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన మరుసటి రోజే ఈ రాజీనామాలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అరెస్టైన వారిలో నగదు లెక్కింపు సిబ్బంది, నగదు లెక్కింపు ప్రక్రియ ఇన్‌ఛార్జి, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించిన రిటైర్డ్ బ్యాంకర్‌తో పాటు చంపత్‌రాయ్‌కు డ్రైవర్‌గా, సన్నిహితుడిగా ఉన్న రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్నూ కూడా ఉన్నారు.
వివరాలు
చోరీ, నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు
ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులపై చోరీ, నమ్మకద్రోహం, మోసం, నేరపూరిత కుట్రతో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.