Champat Rai: రామమందిర విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్‌కు క్లీన్ చిట్
ఈ వార్తాకథనం ఏంటి
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్‌చిట్ ఇచ్చింది. ఇదే కేసులో ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చింది. కేసు దర్యాప్తును పూర్తి చేసిన అనంతరం తుది నివేదికను ఉత్తర్‌ప్రదేశ్ హోంశాఖ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు అందించింది.
వివరాలు
జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేసిన చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా
విరాళాల నిర్వహణలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో చంపత్‌రాయ్, అనిల్ మిశ్రా జూన్ 27న తమ పదవులకు రాజీనామా చేశారు.
అనంతరం సిట్ అధికారులు వారిద్దరినీ విచారించారు. ఆలయానికి వచ్చిన విరాళాల సేకరణ, నగదు నిర్వహణకు సంబంధించిన వివరాలను సిట్ సేకరించింది.
విచారణ సందర్భంగా ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చంపత్‌రాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అక్రమాలు జరిగిన విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే తానే ఫిర్యాదు చేసినట్లు దర్యాప్తు అధికారులకు వివరించినట్లు తెలుస్తోంది.
వివరాలు
విరాళాల కేసులో ఇప్పటికే 8 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
ఈ కేసు దర్యాప్తు కోసం లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు.
రేంజ్ ఐజీ కిరణ్ ఎస్, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్‌రతన్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. జూన్ 23న సిట్ తన ప్రాథమిక నివేదికను సమర్పించింది.
ఆ నివేదిక ఆధారంగా జూన్ 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిని నిందితులుగా చేర్చగా.. వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు.