LOADING...
Ayodhya Temple Donation Theft: చోరీ చేసిన సొమ్మును వాష్‌రూమ్‌లో దాచి.. అయోధ్య రామమందిరం విరాళాలలో కొత్త ట్విస్ట్..
అయోధ్య ఆలయ విరాళాల చోరీలో కొత్త ట్విస్ట్.. వాష్‌రూమ్‌లో నగదు

Ayodhya Temple Donation Theft: చోరీ చేసిన సొమ్మును వాష్‌రూమ్‌లో దాచి.. అయోధ్య రామమందిరం విరాళాలలో కొత్త ట్విస్ట్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 01, 2026
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య ఆలయ విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. నిందితుల విచారణలో విరాళాల చోరీ ఎలా జరిగిందనే అంశంపై కీలక వివరాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆలయంలోని విరాళాల లెక్కింపు విధానంలో ఉన్న లోపాలను ఆసరాగా చేసుకున్న నిందితులు ఎంతో చాకచక్యంగా డబ్బును బయటకు తరలించినట్లు దర్యాప్తులో తేలింది. చోరీ చేసిన నగదును ముందుగా ఆలయంలోని వాష్‌రూమ్‌లలో దాచిపెట్టి, అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా బయటకు తీసుకెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో ఇప్పటికే ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు అనుమతితో నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లాను మంగళవారం రెండు గంటలపాటు పోలీసులు విచారించారు.

వివరాలు 

దర్యాప్తులో మరో కీలక విషయం

ఈ విచారణలో అతడు కేసుకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. విరాళాల లెక్కింపు గదికి సంబంధించిన తాళాలను మరో నిందితుడు టిన్నూ యాదవ్ సమకూర్చాడని, అనంతరం ఎవరూ లేని సమయంలో ఆ గదిలోని నగదును చోరీ చేసినట్లు అవినాష్ శుక్లా అంగీకరించినట్లు సమాచారం. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో,వాటి పర్యవేక్షణ ఎలా జరుగుతుందో నిందితులకు పూర్తిగా తెలిసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని వారు కెమెరాలకు చిక్కకుండా చోరీ చేసిన డబ్బును ముందుగా వాష్‌రూమ్‌లలో దాచిపెట్టారు. అనంతరం అనువైన సమయం చూసుకుని ఆ నగదును ఆలయం వెలుపలికి తరలించినట్లు విచారణలో వెల్లడైంది.

వివరాలు 

చోరీ సొమ్ముతో ఇల్లు, స్థలం కొనుగోలు

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులతో తమకు ఉన్న సాన్నిహిత్యం కారణంగా తమపై ఎలాంటి అనుమానం వ్యక్తం కాదని భావించామని అవినాష్ శుక్లా విచారణలో చెప్పినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ పరిచయాన్ని నమ్మకంగా ఉపయోగించుకుని చాలా కాలం పాటు ఎలాంటి అనుమానం రాకుండా వ్యవహరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చోరీ ద్వారా సంపాదించిన డబ్బుతో తాను ఇల్లు, స్థలం కొనుగోలు చేసినట్లు అవినాష్ శుక్లా విచారణలో అంగీకరించాడు.

Advertisement

వివరాలు 

విచారణలో పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరు 

దీంతో అతడి ఆర్థిక లావాదేవీలతో పాటు మిగతా నిందితుల ఆస్తులపై కూడా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఇంతకాలం ఎవరికీ అనుమానం రాకుండా ఈ చోరీలను ఎలా కొనసాగించారు? వీరి వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా, విచారణ సందర్భంగా నిందితులు పలుమార్లు ట్రస్టీ అనిల్ మిశ్రా పేరును ప్రస్తావించినట్లు సమాచారం. ఈ కేసు బయటపడిన అనంతరం ఆయన ట్రస్ట్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Advertisement