'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్
రామ భక్తులమని చెప్పుకునే కొందరు వ్యక్తులు కేవలం ఓట్ల కోసం శ్రీరాముడిని ఉపయోగించుకుంటున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. రాముడు హిందువులకు మాత్రమే చెందినవాడు కాదని ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. రాముడు పూర్తిగా హిందువులకు చెందినవాడు అని వాదించే వారు ఓట్ల కోసమే ఈ పని చేస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ప్రజలకు సరైన మార్గాన్ని చూపేందుకు రాముడిని అల్లా పంపాడని, ఇటీవల మరణించిన పాకిస్థానీ రచయిత చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా ఉటంకించారు.
ఎన్నికల సమయంలోనే రామమందిరాన్ని ప్రారంభించొచ్చు: ఫరూక్ అబ్దుల్లా
రాముడు కేవలం హిందువుల దేవుడనే విషయాన్ని మనస్సు నుంచి తీసేయాలన్నారు ఫరూక్ అబ్దుల్లా. ముస్లింలు, క్రైస్తవులు, ఇతరులకు ప్రతి ఒక్కరికి శ్రీరాముడు దేవుడని వివరించారు. అధికారం మీద ప్రేమతో కొందరు శ్రీరాముడిపై ప్రేమను నటిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే రామమందిరాన్ని ప్రారంభించొచ్చని ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా జోస్యం చేప్పారు. బ్రిటిష్ వారిని తరిమికొట్టడానికి స్వాతంత్ర్య సమరయోధులందరూ ఎలా కలిసిపోయారో? ఇప్పుడు అది జరగాలన్నారు. స్వాతంత్ర్య సమరయోధులు కులం లేదా మతం గురించి వివక్ష చూపలేదన్నారు. కేవలం వారు బ్రిటిష్ వారిని తరిమికొట్టాలని కోరుకున్నట్లు చెప్పారు. కులాన్ని, మతాన్ని వీడి స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తితో ముందుకుపోవాలన్నారు.