Loading...
Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్
జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్

Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
11:04 am

ఈ వార్తాకథనం ఏంటి

అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లభించడం కలకలం రేపింది. బెంగళూరులోని పరప్పరన అగ్రహారం సెంట్రల్ జైలులో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రేవణ్ణ వద్ద నీలిరంగు ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్, ఛార్జర్, డైరీని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు వెల్లడించారు. జైలులో ఉన్న ఖైదీ వద్దకు మొబైల్ ఫోన్, ఇతర వస్తువులు ఎలా చేరాయనే కోణంలో విచారణ సాగుతోంది.

వివరాలు 

అధికారులపై ప్రభుత్వం చర్యలు

రేవణ్ణ వద్ద ఈ వస్తువులు ఎలా చేరాయన్న అంశంపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది.

దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడంతోపాటు, జైలు అధికారులపై చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా జైలు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఈరన్న రంగాపూర్‌ను సస్పెండ్ చేసింది.

అదే జైలులో చోటుచేసుకున్న లోపాలపై వివరణ ఇవ్వాలంటూ జైలు సూపరింటెండెంట్ అనుష్కు కుమార్‌కు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది.

ఈ తనిఖీలకు సంబంధించిన వివరాలను జైళ్ల శాఖ డీజీపీ అలోక్ కుమార్ వెల్లడించారు.

సెంట్రల్ జైలులో దాదాపు ఐదు గంటలపాటు సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. తనిఖీల్లో ప్రతాప్ రాయ్ అనే మరో ఖైదీ వద్ద కూడా మొబైల్ ఫోన్ లభించిందని చెప్పారు.

వివరాలు 

అత్యాచారం కేసులో జీవిత ఖైదు

ప్రజ్వల్ రేవణ్ణ 2019లో హసన్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా,జేడీ(ఎస్) నేతగా ఉన్న సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఓ మహిళ హోలినరసిపుర రూపల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

ఈకేసులో దర్యాప్తు పూర్తయిన అనంతరం బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది.

కేసును విచారించిన న్యాయస్థానం ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.

దీంతోపాటు రూ.10లక్షల జరిమానా కూడా విధించింది.2025 ఆగస్టు 2న కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.

తనపై అత్యాచారం చేయడంతోపాటు,ఆఘటనను వీడియోలో రికార్డు చేశారంటూ బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

ఈకేసులో శిక్ష అనుభవిస్తున్న రేవణ్ణ వద్ద ఇప్పుడు మొబైల్ ఫోన్,పెన్ డ్రైవ్ లభించడంతో జైలు భద్రత,అధికారుల పర్యవేక్షణపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ADVERTISEMENT