Ujjain Case: ఉజ్జయినిలో బాలికపై అత్యాచారం.. నిందితుడి ఇంటిపైకి బుల్డోజర్
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో మైనర్ బాలికపై జరిగిన అత్యాచర ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అక్రమంగా నిర్మిచారనే కారణంతో, ఆ ప్రధాన నిందితుడి ఇంటిని కూల్చేయబోతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భారత్ సోని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఆ నిందితుడి కుటుంబ కొన్నేళ్లుగా ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నట్లు గుర్తించామని ఉజ్జయిని మున్సిపల్ కమిషనర్ రోషన్ సింగ్ పేర్కొన్నారు. ఆ ఇంటిని కూల్చడానికి ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని, రాష్ట్ర పోలీసులతో కలిసి బుధవారం ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేస్తామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు.
మరణశిక్ష విధించాలి: నిందితుడి తండ్రి
అత్యాచారానికి గురైన ఆ బాలిక రక్తమోడుతూ, అర్ధనగ్నంగా వీధుల్లో తిరిగిన దృశ్యాలు సెప్టెంబర్ 26న వెలుగులోకి వచ్చాయి. ఆ చిన్నారి దీన స్థితిని స్థానికులు పట్టించుకోకుండా ఛీత్కరించుకోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. చివరికి ఓ ఆలయ పూజారి ఆ చిన్నారిని చూసి చలించిపోయి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తును ప్రారంభించారు. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు వందలమందిని విచారించి, దాదాపు 700 కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించారు. తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న భారత్ సోనిని ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడిన తన కుమారుడికి మరణశిక్ష విధించాలని నిందితుడి తండ్రి పేర్కొన్నాడు.