President Murmu : భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 17 మంది బాలబాలికలకు రాష్ట్రీయ బాలపురస్కారాలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా 17 మంది బాలబాలికలకు ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమం గురువారం రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించారు. ఆర్ట్, సంస్కృతి, ధైర్యం, ఆవిష్కరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక సేవ, పర్యావరణం వంటి ఏడు విభాగాల్లో బాలబాలికలు సాధించిన అసాధారణ విజయాలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందజేశారు. అవార్డు గ్రహీతలందరినీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి విజయాలు యావత్ దేశం గర్వించదగ్గవని, వారు అద్భుతమైన పనులతో సామాజిక సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.
దేశానికి ఆదర్శంగా నిలవాలి
ప్రతిభాశాలి పిల్లల ప్రతిభను గుర్తించడం, వారి సామర్థ్యాలను మెరుగుపరచడం మన సాంప్రదాయంలో భాగమని ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2047లో భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాలు జరుపుకోనున్న సందర్భంలో ఈ అవార్డు గ్రహీతలు వివేకవంతులైన పౌరులుగా, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాతలుగా నిలుస్తారని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ఈ చిన్నారులు దేశానికి ఆదర్శంగా నిలిచి, తమ ప్రతిభతో దేశ ప్రగతికి నాంది పలుకుతారని అన్నారు. దేశ అభివృద్ధికి స్ఫూర్తి ప్రసాదించగల వీరి విజయాలు ప్రశంసించదగ్గవని రాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.