Page Loader
Ration Cards: తెలంగాణలో రేషన్‌ లబ్ధిదారులు 3.11 కోట్ల మంది
తెలంగాణలో రేషన్‌ లబ్ధిదారులు 3.11 కోట్ల మంది

Ration Cards: తెలంగాణలో రేషన్‌ లబ్ధిదారులు 3.11 కోట్ల మంది

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో రేషన్‌ సేవలు పొందుతున్న వారిసంఖ్య ఇటీవల మరింతగా పెరిగింది. కొత్తగా కార్డులు మంజూరు చేయడం,అలాగే ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలను చేర్చడం వంటివి జరుగుతున్న నేపథ్యంలో,మే నెలాఖరు నాటికి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3,11,28,921కు చేరుకుందని అధికార వర్గాలు వెల్లడించాయి. మీ-సేవ కేంద్రాలు,కులగణన సర్వేల ద్వారా దరఖాస్తులు ఈ సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇందుకు అనుసంధానంగా పౌర సరఫరాల శాఖ కొన్ని కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం పాత కార్డుల్లో కొత్త కుటుంబ సభ్యులను చేర్చుకోవటానికి కూడా అవకాశం కల్పించబడింది. ఈ క్రమంలో దరఖాస్తులు మీసేవ కేంద్రాలు,కులగణన సర్వేల ద్వారాను అందుతున్నాయి.

వివరాలు 

మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పత్రాల పంపిణీ యోచన 

దరఖాస్తుల పరిశీలన అనంతరం జనవరి 26, ఫిబ్రవరి 28, ఏప్రిల్ 24, మే 23 తేదీల్లో నాలుగు విడతలుగా కొత్తగా మొత్తం 2,03,156రేషన్‌ కార్డులు మంజూరు చేశారు. అలాగే, తొమ్మిది విడతలుగా పాత కార్డుల్లో కొత్తగా కుటుంబ సభ్యులుగా 29,81,356 మందిని చేర్చారు. అధికారులు చెబుతున్నట్లుగా రేషన్‌కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియగా సాగుతోంది. ఇప్పటికీ పరిశీలనలో ఉన్న దరఖాస్తుల సంఖ్య పెద్దగా ఉందని వారు స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే మంజూరైన కొత్త రేషన్‌ కార్డులు లబ్ధిదారులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. స్థానిక మంత్రులు,శాసనసభ్యుల చేతుల మీదుగా ఈ కార్డులను పంపిణీ చేయాలన్నదే అధికారుల ఆలోచన. దీనిని ప్రభుత్వ స్థాయిలో అట్టహాసంగా నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

వివరాలు 

కుటుంబాల గణాంకాల వివరాలు ఇలా ఉన్నాయి: 

కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలోని మొత్తం కుటుంబాల సంఖ్య: 1,15,71,457 ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఆహార భద్రత కార్డుల సంఖ్య (పాతవి, కొత్తవి కలిపి): 91,98,438 రేషన్‌ కార్డులు ఉన్న కుటుంబాల శాతం: 79.49%