Ration Card: సంక్రాంతి తర్వాత రాష్ట్రంలో అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి తరువాత రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ తెల్ల రేషన్ కార్డులు అందజేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు.
శాసనసభలో ఈ శాఖపై గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, కొత్తగా తెల్ల రేషన్ కార్డులను జారీ చేయడంతోపాటు పేదలకు దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం అందించాలని ప్రభుత్వం యోచన చేస్తోందని పేర్కొన్నారు.
ఈ చర్యలను రాబోయే రెండు, మూడు నెలల్లో అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో బియ్యం అక్రమ వ్యాపారాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని, రేషన్ బియ్యం పక్కదారి పడితే తీవ్రమైన చర్యలు చేపడతామన్నారు.
రేషన్ దుకాణాలకు సరఫరా అవుతున్న బియ్యంలో తూకం తేడాలు నివారించేందుకు వేబ్రిడ్జిలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వివరాలు
నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే ప్రణాళిక
ప్రజాపంపిణీ వ్యవస్థను రద్దు చేసి, లబ్ధిదారులకు నేరుగా డబ్బు చెల్లించే ఆలోచనలేమీ ప్రస్తుతానికి లేదని, అలాగే నిత్యావసరాలను పేదల ఇంటికే డెలివరీ చేసే ప్రణాళికపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.
రేషన్ డీలర్లకు బీమా సౌకర్యం అందించేందుకు పరిశీలన చేస్తున్నామని చెప్పారు.
సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కొత్త రేషన్ కార్డుల జారీతోపాటు డీలర్లకు క్వింటాకు కనీసం రూ.300 కమిషన్ అందించాలనే సూచన చేయగా, భారాస సభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కంటి ఆపరేషన్ చేయించుకున్న వారు ఐరిస్ ద్వారా సరకులు పొందలేకపోతున్నారని, అటువంటి వారికి మూడో వ్యక్తి ద్వారా సరకులు అందించాలనే అంశాన్ని పరిశీలించాలని కోరారు.