Kesineni Nani: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. మాజీ ఎంపీ కేశినేని నాని కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
గత లోక్‌సభ ఎన్నికల్లో విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే.
తన తమ్ముడు కేశినేని చిన్ని (శివనాథ్) చేతిలో ఓటమిపాలైన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిన తర్వాత, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారిక ప్రకటన కూడా చేశారు. అయితే ఇటీవల కేశినేని నాని తిరిగి రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియా ద్వారా స్పందించి, తన నిర్ణయం మారలేదని స్పష్టం చేశారు.
Details
రాజకీయ రీఎంట్రీపై స్పష్టత
తన రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానని, గతేడాది జూన్ 10న తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించానని గుర్తు చేశారు.
ఆ నిర్ణయం ఇప్పటికీ మార్చుకోలేదని, ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని తాను నమ్ముతున్నానని చెప్పారు.
విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తానని, తన సేవ ఏ రాజకీయ పార్టీకి లేదా పదవికి అనుబంధంగా ఉండదని ఆయన స్పష్టం చేశారు.
తన రాజకీయ రీఎంట్రీపై వస్తున్న నిరాధార వార్తలను ఎవరూ నమ్మొద్దని కేశినేని నాని వెల్లడించారు.