#NewsBytesExplainer: పెట్టుబడిదారుల కొత్త ఫేవరెట్.. ఏపీ టైర్-2 నగరాలు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లోని టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ వేగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలోనే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం దాదాపు 46% పెరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆ తర్వాత కూడా అదే ఉత్సాహం కొనసాగుతుంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు,రాజమండ్రి .. ఈ ఏడు నగరాలు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకి మొదటి ఎంపికగా మారిపోయాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. గత ఏడాది నుంచి ఈ ప్రాంతాల్లో భూమి ధరలు 8 నుండి 15శాతం వరకు ఎగబాకాయి. హైదరాబాద్, బెంగుళూరు వంటి మెట్రో నగరాల నుంచి, అలాగే అమెరికా-దుబాయ్‌లో ఉండే ఎన్నారైల నుంచి కూడా ఈ టైర్-2 సిటీల్లో భూములు,ఫ్లాట్ల కొనుగోలుపై ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది.
వివరాలు
ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు
ఇప్పుడే కొనుగోలు చేస్తే రిస్క్ తక్కువ, రాబడి ఎక్కువ అనే లెక్కతో పెట్టుబడులు పెడుతున్నారు. 2025 నుంచి 2027 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ టైర్-2 మార్కెట్‌నే అతిపెద్ద బూమ్ ఎదురుచూస్తుందని చాలామంది నమ్ముతున్నారు. ఈ వేగానికి ప్రధాన కారణం పెట్టుబడుల ప్రవాహమే. దాదాపు ప్రతి జిల్లాలో పెద్ద పెద్ద ఇన్వెస్ట్‌మెంట్ ప్రకటనలు వస్తున్నాయి. ఇవి ప్రాజెక్టులుగా నేలమీదికి వస్తే, వాటికి అనుబంధంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వంపై పెరిగిన నమ్మకమే పెట్టుబడులను లాగిస్తుంటే, అదే పెట్టుబడులు రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింతగా లేపుతున్నాయి.