విశాఖలో రియల్ దంపతుల కిడ్నాప్.. రూ.3 కోట్ల స్కామ్ చేశారని కిడ్నాపర్ల ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్నంలో మరో కుటుంబం కిడ్నాప్ కు గురైంది. రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని బుధవారం సాయంత్రం ఏడుగురు వ్యక్తుల బృందం అపహరించింది.
భార్యభర్తలను కారులో విజయవాడకు తరలించాలని కిడ్నాపర్లు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మార్గమధ్యంలో వ్యాపారి భార్య లక్ష్మి చాకచక్యంగా తప్పించుకున్నారు.
వెంటనే డయల్ 100కు కాల్ చేసి జరిగినదంతా పోలీసులకు చెప్పింది. ఈ మేరకు రంగంలోకి దిగిన కాకినాడ పోలీసులు సదరు కిడ్నాపర్లను అన్నవరం వద్ద గుర్తించారు. అనంతరం విశాఖ 4వ టౌన్ ఠాణాకు తరలించారు.
కిడ్నాప్ కు గల కారణాలపై విశాఖ పోలీసులు విచారించారు. విజయవాడలో చాలా మంది నుంచి శ్రీనివాస్ అప్పులు తీసుకుని విశాఖకు మకాం మార్చాడని వెల్లడైంది.
DETAILS
స్కామ్ లో రూ.60 లక్షల వాటా తమకు ఇవ్వాలని కిడ్నాపర్ల డిమాండ్
2021లో బెజవాడ పటమట ఠాణాలో శ్రీనివాసరావుపై ఓ కేసు కూడా నమోదైందని, జైలుకు సైతం వెళ్లొచ్చాడని విచారణలో తెలుసుకున్నారు.
మాకాం మార్చాక విశాఖలోని ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో శ్రీనివాసరావు, లక్ష్మి దంపతులు ఏజెంట్లుగా చేరినట్లు పోలీసులు గుర్తించారు. అయితే శ్రీనివాసరావు రూ.3 కోట్లు నొక్కేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అందులో భాగంగానే తమకు రూ. 60 లక్షలు ఇవ్వాలని గతంలో కలిసి పనిచేసిన ఏడుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వారంతా కిడ్నాపర్ల అవతారం ఎత్తారు.
విశాఖలో ఉన్న దంపతులను బెజవాడ తరలించేందుకు ప్లాన్ చేశారు. ముగ్గురు నిందితులను కాకినాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నలుగురు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మురంగా గాలిస్తున్నారు.