Page Loader
వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 
వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు

వైజాగ్ ఎంపీ భార్య, కొడుకు కిడ్నాప్; గంటల వ్యవధిలోనే కాపాడిన పోలీసులు 

వ్రాసిన వారు Stalin
Jun 15, 2023
06:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యలు కిడ్నాప్‌కు గురైన వార్త సంచలనం రేపింది. ఎంపీ భార్య, కుమారుడు, అతని ఆడిటర్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన పోలీసులు గంటల వ్యవధిలో ఎంపీ కుటుంబ సభ్యులను రక్షించారు. తొలుత ఎంపీ భార్య జ్యోతి, కుమారుడు శరద్‌లను ఒక ముఠా కిడ్నాప్ చేసి రూ.1కోటి డిమాండ్ చేసింది. ఎంపీ సహాయకుడు, ఆడిటర్‌జి.వెంకటేశ్వర్‌రావు డబ్బులు అందజేసేందుకు ఓ ప్రదేశానికి వెళ్లగా, అతన్ని కూడా దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కొద్ది గంటల్లోనే వారందరినీ రక్షించినట్లు వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ తెలిపారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలిపారు.

వైజాగ్

మొబైల్ సిగ్నల్స్ సాయంతో ఆచూకీ తెలుసుకున్న పోలీసులు

రెస్క్యూ ఆపరేషన్లో ఇద్దరు పోలీసు అధికారులకు స్వల్ప గాయాలయ్యాయని పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ వెల్లడించారు. ఎంపీ కుటుంబ సభ్యులు ఎప్పుడు కిడ్నాప్ కు గురయ్యారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఆడిటర్ కిడ్నాప్ గురించి గురువారం పోలీసులకు తెలిసింది. ఈ కిడ్నాప్‌కు పాల్పడిన రౌడీషీటర్ హేమంత్ కుమార్ తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మొబైల్ సిగ్నల్స్ సహాయంతో ఏలూరు-అమలాపురం రహదారిపై ఎంపీ కుటుంబ సభ్యులు ఉన్నట్లు గుర్తించి, రక్షించారు. ఈ ఆపరేషన్లో పోలీసు వాహనం కూడా ధ్వంసమైంది. మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు వివరాలను పూర్తి వివరాలు సేకరించిన తర్వాత వెల్లడిస్తామని కమిషనర్ చెప్పారు. కిడ్నాప్ జరిగిన సమయంలో ఎంపీ హైదరాబాద్లో ఉన్నారు.