Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్‌కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
ఈ వార్తాకథనం ఏంటి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిరంతర విద్యుత్ సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. బొగ్గు సరఫరా సంస్థలతో సమన్వయం సాధించి అధిక గ్రాస్ కలోరిఫిక్ వాల్యూ (జీసీవీ) కలిగిన బొగ్గును సమకూర్చుకున్నామని చెప్పారు. సరఫరా చేసిన బొగ్గుకు సంబంధించిన బిల్లులను నిర్దేశిత గడువులో పూర్తిగా చెల్లించామని, వాష్డ్‌కోల్ సరఫరాదారులకు ముందస్తు చెల్లింపులు జరిపినట్లు వివరించారు.
Details
పది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రంలోని మొదటి యూనిట్‌లో ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్స్ పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల 105 నుంచి 200 మెగావాట్ల వరకు అదనపు విద్యుత్ ఉత్పత్తి చేయగలిగామని తెలిపారు. అంతేకాకుండా, థర్మల్ కేంద్రాల వద్ద పది రోజులకు సరిపడా బొగ్గు నిల్వలను నిరంతరం ఉంచుతున్నట్లు వెల్లడించారు. బొగ్గు సరఫరా కంపెనీలకు బకాయిలు చెల్లించేందుకు హడ్కో నుంచి 8.95 శాతం వడ్డీ రేటుతో రూ.1,000 కోట్ల నిర్వహణ మూలధన రుణాన్ని తీసుకున్నామని తెలిపారు. అలాగే థర్మల్, జల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల ఆధునికీకరణ పనుల కోసం 9 శాతం వడ్డీ రేటుతో రూ.993 కోట్ల రుణాన్ని సమకూర్చుకున్నట్లు పేర్కొన్నారు.
Details
రూ.60 కోట్ల మేర ఆదా
ఎస్‌బీఐ, యూనియన్ బ్యాంకులతో సంప్రదింపులు జరిపి క్యాష్ క్రెడిట్, వర్కింగ్ క్యాపిటల్ డిమాండ్ రుణాలపై వడ్డీ రేట్లను వరుసగా 8.7 శాతం, 9.05 శాతానికి తగ్గించగలిగామని తెలిపారు. దీని ద్వారా సంస్థకు ఏటా సుమారు రూ.60 కోట్ల మేర ఆదా కలుగుతోందన్నారు. అదేవిధంగా గతంలో పెనాల్టీ వడ్డీ కింద బ్యాంకులకు చెల్లించిన రూ.17 కోట్లను సంప్రదింపుల ద్వారా తిరిగి వసూలు చేయగలిగామని ఎండీ నాగలక్ష్మి వివరించారు.