Lowest Temperatures: రికార్డు స్థాయిలో చలి.. సింగిల్ డిజిట్ టెంపరేచర్లతో అల్లూరి ఏజెన్సీ గడ్డకట్టేలా!
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి ఏజెన్సీలో తీవ్రమైన చలి నెలకొంది. ప్రాంతవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. జిమాడుగుల, అరకు, మినుములూరు వద్ద రికార్డు స్థాయిలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, పాడేరు, ముంచింగిపుట్టు, పెదబయలు ప్రాంతాల్లో 4 డిగ్రీలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర చలికి వణుకుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ బయటకు రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. అల్లూరి ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో తెల్లవారుజామున మంచు కురుస్తోంది. చలి తీవ్రత కారణంగా పార్క్ చేసిన వాహనాల అద్దాలపై మంచు గడ్డకట్టేలా పరిస్థితి మారింది. రోడ్ల పక్కన చలి మంటలు వేసుకుని జనాలు కొంతసేపైనా ఉపశమనం పొందే ప్రయత్నంలో ఉన్నారు.
Details
తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దు
ఈ చలి ప్రభావం మరో వారం రోజులు కొనసాగవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దని సూచించింది. ఉదయం భారీ మంచు కురుస్తుండడంతో పక్కనున్న వ్యక్తి కూడా కనబడటం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇక తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబర్ 7 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరుగుతుందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 10 నుంచి 13 మధ్య టెంపరేచర్లు ఘోరంగా పడిపోనున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు చేరాయి. అసిఫాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పెద్దపల్లి, వరంగల్, సంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర చలి కొనసాగుతోంది.