Gudur: గూడూరులో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత.. 45.8 డిగ్రీల వేడి నమోదు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతూ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. గురువారం శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదై ఈ సీజన్‌లోనే అత్యధికంగా నిలిచింది. ఏప్రిల్‌లో ఇదే గరిష్ఠంగా ఉండగా మే నెలలో ఇంకా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో 41 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరులో 25, ప్రకాశం జిల్లాలో 22, మార్కాపురం ప్రాంతంలో 15, నంద్యాలలో 14, చిత్తూరులో 13, గుంటూరు జిల్లాలో 11 మండలాల్లో 41 డిగ్రీలకుపైగా నమోదైంది.
వివరాలు
రాయలచెరువులో 44.3 డిగ్రీలు నమోదు
కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత తీవ్రమైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2 డిగ్రీలు, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45 డిగ్రీలు, తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెం, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లె, నంద్యాల జిల్లా సంజామ, వైఎస్సార్ జిల్లా కోడూరులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతంలో అత్యధిక ఉష్ణోగ్రతలకుగాను పల్నాడు జిల్లా రెంటచింతల పేరు వినిపించేది. అయితే ఈ ఏడాది మార్కాపురం, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలు ఆ రికార్డులను అధిగమిస్తున్నాయి.
వివరాలు
రెంటచింతలలో మాత్రం 41.2 డిగ్రీల ఉష్ణోగ్రత
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నివేదికల ప్రకారం ఏప్రిల్ 27న మార్కాపురం జిల్లా బేస్తవారిపేట, కంభం మండలాల్లో 45.7 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదనంగా మరో 9 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గత నెల 26, 28 తేదీల్లో కూడా రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు మార్కాపురం జిల్లాలోనే నమోదయ్యాయి. అదే సమయంలో రెంటచింతలలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గురువారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా నమోదైనప్పటికీ, రెంటచింతలలో మాత్రం 41.2 డిగ్రీలు మాత్రమే నమోదయ్యాయి.