Telangana Rains: తెలంగాణలో ఇవాళ 8 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. విద్యా సంస్థలకు సెలవు
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారాయి. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్ సహా ఎనిమిది జిల్లాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఆదివారం తెల్లవారుజామున కళింగపట్నం వద్ద తీరం దాటింది. ఈ వాయుగుండం ఆదివారం సాయంత్రానికి రామగుండానికి 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై, తర్వాత ఛత్తీస్‌ఘడ్, విదర్భ మీదుగా కదులుతూ అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
కాకరవాయిలో అత్యధిక వర్షపాతం నమోదు
రుతు పవన గాలుల ద్రోణి కూడా మధ్యప్రదేశ్‌లోని గుణ ప్రాంతం నుంచి ఛత్తీస్‌ఘడ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. దీంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. సోమవారం ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇతర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఖమ్మం జిల్లాలో ఆదివారం కాకరవాయి గ్రామంలో అత్యధికంగా 52.19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యవసరం అయితేనే బయటికి రావాలి
విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి సోమవారం, మంగళవారాల్లో రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్ ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్వహణకు అనుమతిస్తూ, సైబరాబాద్ పోలీసులు సూచనలు జారీ చేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు కోరుతున్నారు.