ఫ్రిడ్జ్ కొంటున్నారా? అయితే మీ జేబు ఖాళీ కావాల్సిందే!
సాధారణంగా వేసవిలో ఉపయోగించే వస్తువులు చలికాలంలో తక్కువ ధరకు లభిస్తాయి. మార్చి వచ్చిందంటే చాలు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధరలు అమాంతం పెరిగిపోతాయి. కానీ ఈసారి మాత్రం రిఫ్రిజిరేటర్ల విషయంలో మాత్రం కొంచెం ముందుగానే ధరలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ కొత్త నిబంధనలే ఇందుకు కారణం. ఇప్పుడు గోద్రెజ్, హైయర్, పానాసోనిక్ వంటి కంపెనీల రిఫ్రిజిరేటర్ల కోసం కస్టమర్‌లు 2-5 శాతం ఎక్కువ చెల్లించవలసి ఉంటుంది. ఫ్రాస్ట్-ఫ్రీ ఫ్రిజ్ ఫ్రీజర్, రిఫ్రిజిరేటర్ ప్రొవిజనింగ్ యూనిట్లను వేర్వేరుగా లేబుల్ చేయడం ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇది తయారీదార్లకు ఇన్‌పుట్ ఖర్చును పెంచుతోంది.
ఈ కొత్త నిబంధనలు తయారు ఖర్చును పెంచుతున్నాయి
రిఫ్రిజిరేటర్ ని ఎనర్జీ ఎఫెక్టివ్‌గా తయారు చేయడానికి అయ్యే ఖర్చు తయారీ ఖర్చును 3 శాతం వరకు పెంచుతుంది. అయితే, ఇది వివిధ మోడల్స్, స్టార్ రేటింగ్‌లపై ఆధారపడి ఉంటుంది. గోద్రెజ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ కమల్ నంది మాట్లాడుతూ, "ఇప్పుడు వస్తువులను విడిగా లేబుల్ చేయవలసి ఉంటుంది కాబట్టి, రిఫ్రిజిరేటర్ల ధర 2-3 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. అయితే రిఫ్రిజిరేటర్ల నికర సామర్థ్యాన్ని కంపెనీలు తెలియజేయాల్సి ఉంటుంది" అని అన్నారు. నికర సామర్థ్యం అంటే వినియోగదారులు వాస్తవానికి ఉపయోగించగల సామర్థ్యం. 5 శాతం మేర రిఫ్రిజిరేటర్ల ధరలు పెంచనున్నట్లు పానాసోనిక్ మేనేజింగ్ ఎడిటర్ తెలిపారు.