Air India: అధిక ధరలకు బుక్ చేసినవారికి రీఫండ్.. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమానాల రద్దులతో దేశవ్యాప్తంగా ఏర్పడిన విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్రం విధించిన ఎకానమీ క్లాస్ చార్జీల గరిష్ట పరిమితిని అమలు చేయడం ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రకటించాయి. డిసెంబరు 6న సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ (MoCA) జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ రెండు సంస్థలు తమ రిజర్వేషన్ వ్యవస్థల్లో కొత్త చార్జీలను అమలు చేస్తున్నాయి.
Details
ఎకానమీ చార్జీలపై క్యాప్ అమలు
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఇప్పటికే మొత్తం వ్యవస్థలో కొత్త చార్జీల రోల్‌అవుట్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. ఎయిర్ ఇండియా మాత్రం దశలవారీగా అమలు చేస్తోందని, మరికొన్ని గంటల్లో పూర్తిగా ప్రభావంలోకి వస్తాయని స్పష్టం చేసింది. మూడో పక్ష సాంకేతిక వ్యవస్థలపై ఆధారపడటం వల్లే ఈ దశలవారీ అమలు అవసరమైందని సంస్థ పేర్కొంది. అధిక ధరలకు టికెట్లు కొన్నవారికి రీఫండ్ కొత్తగా అమలులోకి వచ్చిన గరిష్ట చార్జీల కంటే ఎక్కువ ధరలకు ఇప్పటికే ఎకానమీ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ధర తేడాను రీఫండ్ చేస్తామని ఎయిర్ ఇండియా ధృవీకరించింది.
Details
ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాలు
ఇండిగో ఆపరేషనల్ సమస్యల కారణంగా కష్టాల్లో ఉన్న ప్రయాణికుల కోసం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అదనపు సహాయక చర్యలను ప్రకటించాయి. డిసెంబరు 4 వరకు బుక్ చేసుకున్న, డిసెంబరు 15 వరకు ప్రయాణించే దేశీయ విమాన టికెట్లకు మార్పులు లేదా రద్దులపై ప్రత్యేక వేవర్ వర్తిస్తుందని సంస్థలు తెలిపాయి. జర్నీ రీస్కెడ్యూల్ చేస్తే రీషెడ్యూలింగ్ ఫీజు ఉండదు. ప్రయాణాన్ని రద్దు చేస్తే క్యాన్సిలేషన్ ఛార్జీలు లేకుండా పూర్తి రీఫండ్ లభిస్తుంది. అయితే, చార్జీల తేడా ఉంటే అది వర్తించనుంది. ఈ వేవర్ డిసెంబరు 8 వరకు చేసిన మార్పులు, రద్దులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ప్రయాణికులు 24x7 కాంటాక్ట్ సెంటర్లు లేదా ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ సేవలను పొందవచ్చు.