LOADING...
Regeneron: హైదరాబాద్‌లో బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం
హైదరాబాద్‌లో బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం

Regeneron: హైదరాబాద్‌లో బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
08:45 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలోని న్యూయార్క్‌ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్‌ దిగ్గజం 'రీజెనరాన్‌'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి సమక్షంలో రీజెనరాన్‌ సంస్థ సీనియర్‌ ఉపాధ్యక్షుడు బ్యారీ కోవల్‌, తెలంగాణ జీవశాస్త్ర రంగ సంస్థ ప్రధాన కార్యనిర్వాహక అధికారి సర్వేశ్‌సింగ్‌ పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. అత్యాధునిక మౌలిక వసతులు,నైపుణ్యం కలిగిన మానవ వనరులు హైదరాబాద్‌కు ప్రధాన బలంగా నిలుస్తున్నాయని చెప్పారు.అందువల్లే ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు తమ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల ఏర్పాటుకు నగరాన్ని ప్రాధాన్యంగా ఎంచుకుంటున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

హైదరాబాద్‌లో సుమారు 450 అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు

రీజెనరాన్‌కు ఐర్లాండ్‌, బ్రిటన్‌, జర్మనీ, నెదర్లాండ్స్‌ దేశాల్లో కార్యాలయాలు, ఉత్పత్తి కేంద్రాలు ఉన్నప్పటికీ.. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న కేంద్రం ప్రత్యేక అంతర్జాతీయ కేంద్రంగా పనిచేయనుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంస్థ నిర్వహించే కార్యకలాపాలకు ఇది సమన్వయ వేదికగా ఉండటంతో పాటు.. వైద్య పరిశోధన పరీక్షల నిర్వహణ, ఆధునిక గణాంక విశ్లేషణ, కృత్రిమ మేధస్సు ఆధారిత సేవలు, వ్యాపార విశ్లేషణ వంటి కీలక సేవలను అందించనుందని వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో సుమారు 450 అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. మరిన్ని విదేశీ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని చెప్పారు. అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల స్థాపనలో ముంబయి, దిల్లీ, చెన్నై నగరాలను దాటి హైదరాబాద్‌ దేశంలో రెండో స్థానానికి చేరుకుందని వెల్లడించారు.

వివరాలు 

మరింత బలపడనున్న రాష్ట్ర జీవశాస్త్ర రంగం

జీనోమ్‌వ్యాలీ విస్తరణతో పాటు త్వరలో ఏర్పాటుకానున్న హరిత ఔషధ నగరం వల్ల రాష్ట్ర జీవశాస్త్ర రంగం మరింత బలపడుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. రీజెనరాన్‌ ఏర్పాటు చేయనున్న కేంద్రం ద్వారా రాబోయే కాలంలో పెద్దఎత్తున ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఈ సమావేశంలో రీజెనరాన్‌ అంతర్జాతీయ సామర్థ్య కేంద్ర కార్యనిర్వాహక సంచాలకుడు రాజీవ్‌ ఓనాట్‌, సంస్థ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement