LOADING...
Vizag : 400 ఎకరాల్లో రిలయన్స్‌ డేటా సెంటర్‌.. 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి.. 
400 ఎకరాల్లో రిలయన్స్‌ డేటా సెంటర్‌.. 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి..

Vizag : 400 ఎకరాల్లో రిలయన్స్‌ డేటా సెంటర్‌.. 2030 నాటికి విశాఖలో అందుబాటులోకి.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం మరో మూడు-నాలుగు సంవత్సరాల్లో దేశంలోనే ప్రధాన డేటా సెంటర్‌ కేంద్రంగా ఎదగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన అనేక ప్రముఖ సంస్థలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ డిజిటల్‌ కనెక్షన్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ ద్వారా 400 ఎకరాల భూమిపై 1,000 మెగావాట్ల భారీ డేటా సెంటర్‌ను స్థాపించడానికి సిద్ధమైంది. సుమారు రూ.98వేల కోట్ల వ్యయంతో ఏఐ ఆధారిత ఈ డేటా సెంటర్‌ను 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో కంపెనీ ప్రతినిధులు సీఎంను కలిసి ప్రతిపాదనపై చర్చించారు..

వివరాలు 

సిఫీ టెక్నాలజీస్‌ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్

అవసరమైన భూమి, అనుబంధ సదుపాయాలపై జరిగిన తుది సమావేశాల అనంతరం ప్రభుత్వం మరియు రిలయన్స్‌ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఇదే తరహాలో, గూగుల్‌ రూ.1.33 లక్షల కోట్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణానికి ముందే ప్రభుత్వం‌తో ఒప్పందం చేసుకుంది. మరొక అంతర్జాతీయ దిగ్గజం బ్రూక్‌ఫీల్డ్‌ కూడా రూ.1.10 లక్షల కోట్లతో విశాఖలో డేటా సెంటర్‌ నిర్మాణానికి అంగీకరించింది. మరోవైపు సిఫీ టెక్నాలజీస్‌ రూ.16 వేల కోట్ల పెట్టుబడితో విశాఖలో డేటా సెంటర్‌ కాంప్లెక్స్‌ స్థాపనకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించింది.

ప్రత్యేకతలు 

డేటాసెంటర్‌ ప్రత్యేకతలు 

విశాఖలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ప్రతిపాదిస్తున్న 400 ఎకరాల డేటా సెంటర్‌ గుజరాత్‌ జామ్‌నగర్‌లో ఇప్పటికే ఉన్న 1,000 మెగావాట్ల సెంటర్‌కు అనుబంధంగా పనిచేయనుంది. మాడ్యులర్‌ విధానాలు, గ్రాఫిక్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (GPU), టెన్సర్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు (TPU), ఏఐ ప్రాసెసర్లు వంటి అత్యాధునిక సాంకేతికతలతో వివిధ సంస్థల అవసరాలకు అనుగుణంగా డేటా నిల్వ, ప్రాసెసింగ్‌ సేవలను అందించేందుకు ఇది రూపుదిద్దుకోనుంది. అవసరమైన సబ్‌స్టేషన్లు, ప్రత్యేక విద్యుత్‌ ఫీడర్లు వంటి మౌలిక సదుపాయాలను భవిష్యత్తులో వచ్చే దశాబ్దాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించనున్నారు. ఆసియా ఖండంలో అత్యంత శక్తివంతమైన ఏఐ మౌలిక వసతులతో కూడిన నెట్‌వర్క్‌లలో ఇది ఒకటిగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లక్ష్యం 

లక్ష్యంలో సగం పూర్తి 

విశాఖలో మొత్తం 6,000 మెగావాట్ల డేటా సెంటర్లను 2030 నాటికి ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇప్పటి వరకు గూగుల్‌, రిలయన్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ సంస్థలు కలిపి 3,000 మెగావాట్ల సామర్థ్యానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించాయి. మరో మూడు అంతర్జాతీయ సంస్థలు కూడా చర్చలను కొనసాగిస్తున్నాయి. వాటికి అవసరమైన భూములు, సదుపాయాలపై అధికారులు వేగంగా పరిశీలనలు జరుపుతున్నారు. రాబోయే మూడు నెలల్లోవాటి ప్రతిపాదనలకూ అనుమతులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

పెట్టుబడి

రిలయన్స్‌ పెట్టుబడి సంతోషాన్ని కలిగిస్తోంది 

విశాఖలో 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను స్థాపించేందుకు రిలయన్స్‌-డిజిటల్‌ కనెక్షన్స్‌ సంస్థ రూ.98 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించడం ఎంతో హర్షదాయకమని మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో తన పోస్ట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ భారతదేశ 'డేటా రాజధాని'గా నిలవబోతోందని ఆయన అన్నారు.