LOADING...
Andhra Pradesh : అగ్రిగోల్డ్‌ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ

Andhra Pradesh : అగ్రిగోల్డ్‌ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 13, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

అగ్రిగోల్డ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది. ఆ ప్లాట్ల యజమానులకు వైకాపా ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని సరిదిద్దింది. 2015 ఫిబ్రవరి 20న అప్పటి తెదేపా ప్రభుత్వం జీవో నంబర్‌ 23ను జారీ చేసి,అగ్రిగోల్డ్‌కు చెందిన 16,857.81ఎకరాల భూమి,82,207.08చదరపు గజాల స్థలాలను జప్తు చేయాలని ఆదేశించింది. ఆభూముల్లో అనేక ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌ రూపొందించిన లేఔట్లు ఉన్నాయి. వాటిలో పలువురు చందాదారులు అగ్రిగోల్డ్‌పై ఎలాంటి కేసులు నమోదు కాకముందే ప్లాట్ల కోసం పూర్తిగా డబ్బులు చెల్లించి,చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తిచేశారు.

వివరాలు 

జీవో నంబర్‌ 19 ద్వారా సవరణ ఉత్తర్వులు

ఇలాంటి ప్లాట్లను జప్తు నుంచి మినహాయిస్తామని అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వుల్లోనే ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కానీ వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ మినహాయింపును రద్దు చేస్తూ 2021 ఫిబ్రవరి 9న జీవో నంబర్‌ 19 ద్వారా సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీని వల్ల అనేక మంది ప్లాట్ల యజమానులు ఇబ్బందులకు గురయ్యారు. తమ సమస్యను వారు ఇటీవల సీఐడీ అధికారులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, దీనిపై స్పందించిన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జప్తు నుంచి మినహాయింపును తిరిగి కల్పించడంతో, సంబంధిత ప్లాట్ల యజమానులకు పెద్ద ఊరట లభించినట్లైంది.

Advertisement