Chandrababu: హైకోర్టులో చంద్రబాబుకు ఊరట.. ఆ కేసుల్లో అరెస్టు చేయకూడదంటూ తీర్పు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandra Babu)కు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబు అరెస్టై దాదాపు నెల రోజులు కావొస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన తరుపు లాయర్లు వరుస పీటిషన్లు వేస్తున్నారు. తాజాగా ఓ కేసులో మాత్రం చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై హైకోర్టు (High Court) తీర్పునిచ్చింది. అంగళ్లు కేసులో గురువారం వరకు చంద్రబాబును అరెస్టు చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులోనూ 16వ తేదీ వరకూ అరెస్టు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.
విచారణకు సహకరిస్తామన్న చంద్రబాబు తరుఫు న్యాయవాది
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ రెండు కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చేయకూడదని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కోరారు. ఇక కేసుల్లో విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి ఏజీ శ్రీరామ్ తీసుకెళ్లారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ఆయన కోరారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం రెండు కేసుల్లోనూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.