Angallu Case : టీడీపీ నేతలకు ఊరట.. అంగళ్లు కేసులో జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్టు
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన పుంగనూరు, అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి చుక్కుదురైంది. ఈ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు లో ప్రభుత్వం సవాల్ చేసింది. అయితే ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అంగళ్లులో జరిగిన ఘర్షణలో పోలీసు అధికారులు గాయపడ్డారని, ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది రంజిత్ కుమార్ సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో హైకోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు వెల్లడించింది.
ఆరు పిటీషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
అంగళ్లు కేసులో దేవినేని ఉమా, చల్లా బాబు, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పులివర్తి నానిలతో సహా దాదాపు 41 మందికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ పిటిషన్‌ను అనిరుద్ధ బోస్, జిస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. కాగా, చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ గొడవలకు చంద్రబాబు కారణమని ఆరోసిస్తూ, చంద్రబాబుతో పాటు దాదాపుగా 20 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం వేసిన మొత్తం ఆరు పిటీషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది.