Weather Report: వడగాల్పులకు బ్రేక్.. ఏపీ,తెలంగాణలో వర్షాలు.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. ఎండ తీవ్రత, వడగాల్పులు, ఉక్కబోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది. ఆదివారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపింది. నేటి నుంచి రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, వడగాల్పులు తగ్గుముఖం పడతాయని స్పష్టం చేసింది.
వివరాలు
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
నేడు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, హనుమకొండ, మహబూబాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ స్వల్ప వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల సమయంలో ఈదురుగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. హైదరాబాద్ నగరంలో వచ్చే రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది. దీని కారణంగా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరే అవకాశం ఉందని వివరించింది.
వివరాలు
ఏపీకి వర్షసూచన జారీ
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కూ వర్షసూచన జారీ చేసింది. పోలవరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు పడే అవకాశముందని హెచ్చరించింది. మే నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని తెలిపింది. గత కొద్ది రోజులుగా ఏపీ, తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండి, ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న వర్షాలతో ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తోంది.