
TTD Employees: టీటీడీలో మతప్రచారం కలకలం.. ఇద్దరు ఉద్యోగులపై విచారణకు రంగం సిద్ధం!
ఈ వార్తాకథనం ఏంటి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఇద్దరు ఉద్యోగులపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అందిన ఫిర్యాదుల మేరకు ఒకరు మత ప్రచారకుడిగా మారగా, మరొకరు ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేసినట్టు ఆరోపణలున్నాయి. వీరి తీరుపై టీటీడీకి ఫిర్యాదు అందగా, అధికారులు తక్షణమే చర్యలకు సిద్దమయ్యారు. ఇది కొత్త విషయం కాదు. గతంలోనూ అనేకమంది అన్యమత ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.
Details
ఈ తరహా ప్రవర్తనను ఉపేక్షించం
తాజాగా నలుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. వీరిలో నాణ్యతా విభాగంలో డిప్యూటీ ఇంజినీర్ బీ. ఎలిజర్, బర్డ్ హాస్పిటల్‌లో స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పని చేస్తున్న జీ. అసుంత ఉన్నారు. వీరంతా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టమవడంతో హిందూ ధార్మిక సంస్థ అయిన టీటీడీ వారిపై వేటు వేసింది. హిందూ సంప్రదాయాలను కాపాడాల్సిన స్థలంలో, విరుద్ధ మతాల ప్రచారాలకు పాల్పడటం బాధ్యతారాహిత్యం, సంస్థ విధివిధానాలకు విరుద్ధమని అధికారులు స్పష్టం చేశారు. ఈ తరహా ప్రవర్తనను ఉపేక్షించబోమని టీటీడీ వర్గాలు మరోసారి హెచ్చరించాయి. అధికారిక విధులకు విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.