Loading...
Andhra Pradesh: ఏపీలోని ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీపోలింగ్
ఏపీలోని ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీపోలింగ్

Andhra Pradesh: ఏపీలోని ఐదు జిల్లాల్లోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో నేడు రీపోలింగ్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 06, 2026
08:10 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో ఐదు జిల్లాల పరిధిలోని ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించనున్నారు. అనంతపురం,కర్నూలు,శ్రీకాకుళం,మార్కాపురం,పల్నాడు జిల్లాల్లోని ఈ కేంద్రాల్లో వివిధ కారణాలతో ఎన్నికల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. రిగ్గింగ్‌,పోలింగ్‌ కేంద్రాలపై దాడులు, బ్యాలెట్‌ బాక్సుల అపహరణ వంటి ఘటనలు చోటుచేసుకోవడంతో ఆయా కేంద్రాల్లో జరిగిన పోలింగ్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది. ఈ మేరకు గురువారం రాత్రి 11గంటల తర్వాత సంబంధిత జిల్లా కలెక్టర్లకు రీపోలింగ్‌ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రచెడు గ్రామంలోని 46,47 నంబర్ల పోలింగ్‌ కేంద్రాల్లోకి కొందరు బలవంతంగా చొరబడ్డారు. ఈ క్రమంలో వెబ్‌ కెమెరాలు, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అంతేకాకుండా పోలింగ్‌ సిబ్బందిని బెదిరించి విధులకు ఆటంకం కలిగించారు.

వివరాలు 

బ్యాలెట్‌ బాక్సు ధ్వంసం

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం ఆ రెండు కేంద్రాల్లోనూ మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

ఇదే జిల్లాలోని కూడేరు మండలం మారుట్ల గ్రామంలో 8వ నంబరు పోలింగ్‌ కేంద్రంలోనూ రీపోలింగ్‌ జరగనుంది.

ఈ కేంద్రంలోకి పలువురు అక్రమంగా ప్రవేశించి బ్యాలెట్‌ బాక్సును ధ్వంసం చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందించారు.

దీంతో అక్కడ మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు.

కర్నూలు జిల్లా కోసిగి మండలం అర్లబండ గ్రామంలోని రెండో నంబరు పోలింగ్‌ కేంద్రంలో గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

వివరాలు 

బ్యాలెట్‌ పత్రాలపై సిరా

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసిన ఎన్నికల సంఘం.. మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది.

శ్రీకాకుళం గ్రామీణ మండలం పొన్నాం గ్రామంలోని రెండో నంబరు పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలపై పోలింగ్‌ స్టేషన్‌ నంబరు ముద్రించే సమయంలో సిరా ఎక్కువగా పడింది.

దీంతో బ్యాలెట్‌ పత్రాల ముందు భాగంలో మరకలు ఏర్పడ్డాయి.

ఈ కారణంగా ఓటర్లు ఏ అభ్యర్థికి ఓటు వేశారనే విషయంలో సందేహాలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు గుర్తించారు.

జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించిన ఎన్నికల కమిషనర్‌ అక్కడ రీపోలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

ADVERTISEMENT

వివరాలు 

అండుగూరు గ్రామంలోని 43వ నంబరు పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్

మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలోని ఐదో నంబరు పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ బాక్సును అపహరించిన ఘటన చోటుచేసుకుంది.

పోలింగ్‌ కేంద్రం నుంచి బ్యాలెట్‌ బాక్సును అక్రమంగా బయటకు తీసుకెళ్లి పగలగొట్టినట్లు, అందులో ఉన్న పత్రాలను తొలగించి వేరే పత్రాలు వేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదించారు.

ఈ ఘటన నేపథ్యంలో అక్కడ కూడా మళ్లీ పోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.

పల్నాడు జిల్లా క్రోసూరు మండలం అండుగూరు గ్రామంలోని 43వ నంబరు పోలింగ్‌ కేంద్రంలోకి కొందరు అక్రమంగా చొరబడ్డారు.

దీంతో ఈ కేంద్రంలోనూ రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

ఈ ఏడు పోలింగ్‌ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్‌ జరగనుంది. ఈసారి ఓటర్ల ఎడమ చేతి మధ్య వేలికి (మిడిల్‌ ఫింగర్‌) సిరా గుర్తు వేయనున్నారు.

వివరాలు 

5 జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు నేడు ఎన్నికలు

రాష్ట్రంలో మరోవైపు ఐదు జడ్పీటీసీ, 60 ఎంపీటీసీ స్థానాలకు కూడా శుక్రవారం పోలింగ్‌ జరగనుంది.

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంతో పాటు ఏలూరు జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు మండలాల్లో జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఆయా ప్రాంతాల్లోని 60 ఎంపీటీసీ స్థానాలకు కూడా ఆరో తేదీన ఓటింగ్‌ జరగనుంది. వాస్తవానికి ఈ స్థానాలకు గురువారమే పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంది.

అయితే, భారీ వర్షాలు కురవడంతో ఎన్నికల ప్రక్రియను వాయిదా వేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా వెల్లడించారు.

ADVERTISEMENT