LOADING...
Republic Day: గణతంత్ర వేడుకల్లో సైనిక శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న 'ఆపరేషన్ సిందూర్'
గణతంత్ర వేడుకల్లో సైనిక శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న 'ఆపరేషన్ సిందూర్'

Republic Day: గణతంత్ర వేడుకల్లో సైనిక శక్తి ప్రదర్శన.. ఆకట్టుకున్న 'ఆపరేషన్ సిందూర్'

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 26, 2026
01:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలు మన సాయుధ బలగాల శక్తి సామర్థ్యాలను ఘనంగా ఆవిష్కరించాయి. కర్తవ్యపథ్‌పై జరిగిన పరేడ్‌లో 'ఆపరేషన్‌ సిందూర్‌'లో వినియోగించిన అనేక స్వదేశీ ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తొలిసారిగా భారత సైన్యం 'బ్యాటిల్ అరే ఫార్మాట్'లో కవాతులో పాల్గొని,యుద్ధభూమిలో అమర్చినట్లే ఆయుధాలు, నిఘా పరికరాలు,బలగాల కదలికలను ప్రజలకు చూపించింది. 'ఆపరేషన్‌ సిందూర్‌'నుఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన భారత సైన్యం శకటం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. త్రివిధదళాల మధ్య ఉన్న సమన్వయం ఎంత బలమైనదో తెలియజేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఈ శకటంలో బ్రహ్మోస్‌,ఆకాశ్‌ వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థలతో పాటు,సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ధ్వంసం చేయగల'సూర్యాస్త్ర' రాకెట్ లాంచర్‌,అర్జున్‌ యుద్ధ ట్యాంకును ప్రదర్శించారు.

వివరాలు 

ప్రత్యేక ఆకర్షణగా రెండు మూపురాల ఒంటెలు, జన్‌స్కార్‌ గుర్రాలు

ఈ పరేడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన భైరవ్‌ లైట్ కమాండో బెటాలియన్‌, శక్తిబన్‌ రెజిమెంట్ తొలిసారిగా కవాతులో అడుగుపెట్టాయి. అలాగే రెండు మూపురాల ఒంటెలు, జన్‌స్కార్‌ గుర్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ సమయంలో ధరించే ప్రత్యేక దుస్తుల్లో అశ్విక దళం కవాతు కనుల పండువగా మారింది. అపాచీతో పాటు ప్రచండ్‌ తేలికపాటి హెలికాప్టర్లు, నాగ్‌ క్షిపణి వ్యవస్థలు, ధనుష్‌ తుపాకులు, అత్యాధునిక డ్రోన్లను కూడా ఈ పరేడ్‌లో ప్రదర్శించారు.

వివరాలు 

గగనతలంలో యుద్ధ విమానాలు

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో వినియోగించిన ఎస్‌-400 క్షిపణి వ్యవస్థ ప్రత్యేకంగా దృష్టిని ఆకర్షించింది. ఇక గగనతలంలో యుద్ధ విమానాలు వివిధ ఆకృతుల్లో ఎగురుతూ ఆకాశాన్ని రంజింపజేశాయి. ధ్రువ్‌ హెలికాప్టర్‌ 'సిందూర్‌' జెండాను మోస్తూ ఎగరడం వేడుకలకు మరింత వైభవాన్ని తీసుకొచ్చింది. మొత్తం మీద ఈ గణతంత్ర వేడుకలు భారత సైన్యపు శక్తిని, స్వదేశీ సాంకేతికతను దేశ ప్రజల ముందుకు గర్వంగా తీసుకొచ్చాయి.

Advertisement