Uttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది. అయితే రోజురోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. రెస్క్యూ అధికారులు బహుముఖ వ్యూహంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) బృందం, సైట్‌లోని నిపుణుల బృందం దృష్టి సారించాయి. ఈ క్రమంలోనే కార్మికులను రక్షించడానికి 5ప్లాన్స్‌ను ఏకకాలంలో అమలు చేయాలని కేంద్ర, నిపుణుల బృందాలు నిర్ణయించాయి. అందులోనే భాగంగానే కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్‌ను అమలు చేయడంపై ఫోకస్ పెట్టారు. సొరంగానికి సిల్క్యారా వైపు, బార్కోట్ వైపు రోడ్డును ఏర్పాటు చేయడం, సొరంగం పై నుంచి డ్రిల్లింగ్ చేడడం, లంబ కోణంలో డ్రిల్లింగ్ చేయడం వంటివి అధికారుల ప్లాన్స్‌లో భాగంగా ఉన్నాయి.
రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
సొరంగం పై నుంచి నిలువుగా డ్రిల్లింగ్ చేసే దిశగా రెస్క్యూ సిబ్బంది పనిని ప్రారంభించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) ఆదివారం మధ్యాహ్నానికి సిల్క్యారా టన్నెల్‌కు కొత్త రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను చేరుకోవడానికి ఇది మరొక మార్గాన్ని అందిస్తుందని అధికారులు నమ్ముతున్నారు. శుక్రవారం నుంచి ఆపివేయబడిన రెస్క్యూ మిషన్‌ను తిరిగి ప్రారంభించారు. రెస్క్యూ మిషన్‌లో సహాయం కోసం అధికారులు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు, ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్‌ను నిపుణుల బృందం సంప్రదించింది. కార్మికులను రక్షించేందుకు తాను భారత్‌కు వెళుతున్నట్లు ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ పేర్కొన్నారు.