Milind Deora: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు షాక్.. పార్టీకి మిలింద్ దేవరా రాజీనామా
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మిలింద్ దేవరా పార్టీకి రాజీనామా చేశారు.
మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో మిలింద్ దేవరా ఆదివారం చేరే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2గంటలకు ముఖ్యమంత్రి వర్ష బంగ్లాకు మిలింద్ దేవరా వెళ్లనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తన రాజీనామా విషయాన్ని దేవరా స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
'ఈ రోజు నా రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన అధ్యాయం ముగిసింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేశాను. దీంతో పార్టీతో నా కుటుంబానికి 55ఏళ్ల అనుబంధం ముగిసింది.
ఇన్నేళ్లుగా తిరుగులేని మద్దతు ఇచ్చిన నాయకులకు కృతజ్ఞతలు' అంటూ మిలింద్ దేవరా ట్వీట్‌లో పేర్కొన్నారు.
కాంగ్రెస్
మిలింద్ దేవరా సిట్టింగ్ సీటును శివసేనకు ఇస్తారని ప్రచారం
మిలింద్ దేవరా దివంగత సీనియర్ మహారాష్ట్ర నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మురళీ దేవరా కుమారుడు.
మిలింద్ దక్షిణ ముంబై పార్లమెంట్ స్థానం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ముంబై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ఈ స్థానాన్ని I.N.D.I.A కూటమి మిత్రపక్షమైన శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం)కి ఇస్తారనే ఊహాగానాల నేపథ్యంలో దేవరా పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరుతున్నారా? అని మిలింద్ దేవరాను మీడియా అడగ్గా.. అయితే ఊహాగానాలను నమ్మొద్దని, అవన్నీ పుకార్లని పేర్కొన్నారు.