PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అనుమతుల మంజూరులో జాప్యం లేకుండా చూడటంతో పాటు సాంకేతిక ఆధారిత పర్యవేక్షణను పెంచితే ఇలాంటి సమస్యలను సమర్థంగా ఎదుర్కొవచ్చని పేర్కొన్నారు. కెన్-బెట్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కెన్-బెట్వా ప్రాజెక్టుతో పాటు వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల అమలులో ఆలస్యం జరిగితే వ్యయభారం పెరగడమే కాకుండా ప్రజలకు అందాల్సిన సౌకర్యాలు కూడా ఆలస్యమవుతాయని ఆయన తెలిపారు. ఈ విషయాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
వివరాలు
కాల్వల వెంబడి సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు
దేశంలో నీటి భద్రతను బలోపేతం చేయడానికి నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి అంశాల్లో రాష్ట్రాలు మరింత దృష్టి పెట్టాలని ప్రధాని సూచించారు. 'స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ 2.0' అమలు పురోగతిని కూడా ఆయన పరిశీలించారు. పట్టణ ప్రాంతాల్లో ఇంటి పైకప్పులపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని తెలిపారు. అలాగే కాల్వలపై, కాల్వల వెంబడి సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చురుకుదనంతో వ్యవహరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.